రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో త్రీడీ ప్లేయర్‌గా పిలువబడే టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ అదరగొడుతున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేసిన శంకర్ (187 బంతుల్లో 112; 7 ఫోర్లు, సిక్సర్).. ప్రస్తుత సీజన్‌లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌కు ముందు మహారాష్ట్రపై 214 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 107 పరుగులు, అంతకుముందు ముంబైపై 174 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసిన శంకర్ వరుసగా మూడు సెంచరీలు చేసి రంజీల్లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. 2019 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన శంకర్.. తాజా ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు.
భారత టెస్ట్ టీమ్‌లో ఎలాగూ హార్ధిక్ పాండ్యా ప్లేస్ ఖాళీగా ఉండటంతో ఆ స్థానంపై శంకర్ కన్నేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన శంకర్.. 2018-19 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడినప్పటికీ, ఆశించినంత ప్రభావం చూపలేక జట్టులో స్థానం కోల్పోయాడు.
2019 వరల్డ్‌కప్ సందర్భంగా నాటి భారత జట్టు ప్రధాన సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణిస్తూ టీమిండియాకు ఎంపిక చేశాడు. అప్పట్లో అంబటి రాయుడును తప్పించి శంకర్‌కు జట్టులోకి తీసుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. తనను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయకపోవడం పట్ల రాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. వరల్డ్‌కప్‌ను త్రీడీ కళ్లజోడుతో చూస్తానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
రాయుడును కాదని నాడు జట్టులో వచ్చిన శంకర్ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు. నాటి నుంచి జట్టుకు దూరంగా ఉన్న శంకర్ తాజాగా హ్యాట్రిక్ సెంచరీలు బాది తిరిగి వార్తల్లో నిలిచాడు.
ఇదిలా ఉంటే, అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న అస్సాం తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 247 పరుగులు వెనుకపడి ఉంది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.
అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. శంకర్‌తో పాటు జగదీశన్ (125), ప్రదోశ్ పాల్ (153) శతకాలు బాదారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 266 పరుగులకే ఆలౌటైంది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఫలితంగా తేలడం ఖాయంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment