ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బారత జట్లను కొద్ది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్ల ప్రకటనకు ముందు భారత క్రికెట్ సర్కిల్స్‌లో ఓ పేరు బలంగా వినపడింది. అదే కరుణ్ నాయర్. ఈ విదర్భ ఆటగాడు తాజాగా ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో నమ్మశక్యం కాని రీతిలో పరుగులు సాధించాడు.
ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో 779 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడైనా జాతీయ జట్టులో చోటు ఆశించడం సహజం. అయితే భారత సెలెక్టర్లు కరుణ్ అద్భుత ప్రదర్శనను పక్కకు పెట్టి ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి కానీ అతన్ని ఎంపిక చేయలేదు.
కరుణ్ కేవలం విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనలతోనే భారత జట్టులో చోటు ఆశించాడనుకుంటే పొరబడినట్లే. కరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.
కరుణ్ గత సీజన్ రంజీ ట్రోఫీలోనూ రెచ్చిపోయి ఆడాడు. గడిచిన ఎడిషన్‌లో కరుణ్ 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.
కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్‌లోనూ విశేషంగా రాణించాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్‌లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.
గతేడాది ఇంత ఘన ప్రదర్శనలు చేసిన కరుణ్ భారత జట్టులో చోటు ఆశించడం సహజమే. అయితే కరుణ్ కలలు కన్నట్లు భారత జట్టులో చోటు లభించకపోగా ఎలాంటి ముందస్తు హామీ కూడా లభించలేదు. ఇప్పుడు కాకపోతే త్వరలోనైనా సెలెక్టర్లు అతన్ని కరుణిస్తారా అంటే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు.
ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి జాతీయ జట్టుకు ఎంపిక కాని క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కరుణ్ నాయరే అని చెప్పాలి. టీమిండియాకు ఆడిన అనుభవం లేక అతన్ని పరిగణలోని తీసుకోవడం లేదా అంటే అలాంటదేమీ లేదు. కరుణ్ ఎనిమిదేళ్ల కిందట టీమిండియా తరఫున ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, కరుణ్ మాత్రమే ట్రిపుల్ సాధించారు. ఇంత టాలెంట్ కలిగి ఉండి కూడా కరుణ్ జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడం నిజంగా చింతించాల్సిన విషయమే.
Comments
Please login to add a commentAdd a comment