రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రపై 69 పరుగుల తేడాతో విజయం
తొలిసారి విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్లో ప్రవేశం
ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్ సెంచరీలు
కరుణ్ నాయర్ మరో మెరుపు ఇన్నింగ్స్
రేపు జరిగే టైటిల్ పోరులో కర్ణాటకతో ఢీ
వడోదర: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిన విదర్భ తుది పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో విదర్భ 69 పరుగుల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ రాథోడ్ (101 బంతుల్లో 116; 14 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ షోరే (120 బంతుల్లో 114; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 34.4 ఓవర్లలో 224 పరుగులు జోడించారు.
అనంతరం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణ్ నాయర్ (44 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరో దూకుడైన ఇన్నింగ్స్‌తో చెలరేగగా... జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. 40 ఓవర్లు ముగిసేసరికి విదర్భ స్కోరు 254 కాగా... చివరి 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 126 పరుగులు సాధించింది! ముఖ్యంగా ముకేశ్ వేసిన 47వ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ కొట్టిన కరుణ్ నాయర్... రజనీశ్ గుర్బానీ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 4, 0, 6, 4, 4, 6 బాదాడు. ఒకదశలో 35 బంతుల్లో 51 వద్ద ఉన్న కరుణ్ తర్వాతి 9 బంతుల్లో 37 పరుగులు రాబట్టాడు.
అనంతరం మహారాష్ట్ర కొంత పోరాడగలిగినా చివరకు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో మహారాష్ట్ర 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (101 బంతుల్లో 90; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకోగా... అంకిత్ బావ్నే (49 బంతుల్లో 50; 5 ఫోర్లు), నిఖిల్ నాయక్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. దర్శన్ నల్కండే, నచికేత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కర్ణాటక జట్టు ఇప్పటికే నాలుగుసార్లు విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఫైనల్లో ప్రత్యర్థి జట్టు విదర్భ కెప్టెన్‌గా తన పాత జట్టుపై సమరానికి సిద్ధమయ్యాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో ఏకంగా 752 పరుగులు సాధించిన నాయర్ తన టీమ్‌ను విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరం!
Comments
Please login to add a commentAdd a comment