విజయ్ హజారే ట్రోఫీ-2025లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాయంతో 664 పరుగులు చేశాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఒంటిచేత్తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనల అనంతరం కరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు ఆశిస్తున్నాడు. కరుణ్ ఫామ్ చూస్తే అతన్ని తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉంది.
ఇలాంటి ప్రదర్శనలు కరున్ ఇటీవలి కాలంలో చాలా చేశాడు. కరుణ్ ఫార్మాట్లకతీతంగా ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీ ట్రోఫీల్లో, కౌంటీ క్రికెట్‌లోనూ కరుణ్ అద్బుత ప్రదర్శనలు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత కూడా భారత సెలెక్టర్లు కరుణ్‌ను పట్టించుకోకపోతే పెద్ద అపరాధమే అవుతుంది. మిడిలార్డర్‌లో కరుణ్ చాలా ఉపయోగకరమైన బ్యాటర్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
అయితే కరుణ్.. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేయడం సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. కరుణ్ ప్రదర్శనలు చూస్తే తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. రాహుల్, శ్రేయస్‌లను పక్కకు పెట్టే సాహసాన్ని టీమిండియా సెలెక్టర్లు చేయలేరు. సెలెక్టర్లు ఏం చేయనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును జనవరి 19వ తేదీ ప్రకటించే అవకాశం ఉంది.
కరుణ్‌తో పాటు మరో ఆటగాడు కూడా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కర్ణాటక సారధి మయాంక్ అగర్వాల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఇంచుమించు కరుణ్ ఉన్న ఫామ్‌లోనే ఉన్నాడు. వీహెచ్‌టీలో మయాంక్ 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీల సాయంతో 619 పరుగులు చేశాడు. మయాంక్ ఓపెనర్ స్థానం కోసం అంతగా ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌తో పోటీ పడతాడు. భారత సెలెక్టర్లు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరుణ్ విషయానికొస్తే.. వీహెచ్‌టీ-2025లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా (112*, 44*, 163*, 111*, 112*, 122*) నిలిచి ఐదు శతకాలు బాదాడు. ఈ టోర్నీలో కరుణ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు స్కోర్ చేసిన రికార్డును కరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
వీహెచ్‌టీ సింగిల్ ఎడిషన్‌లో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్‌కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ తన అరివీర భయంక ఫామ్‌తో టీమిండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు. కరుణ్ విదర్భ జట్టుకు రాక ముందు గడ్డు రోజులు ఎదుర్కొన్నాడు. అతనికి తన సొంత రాష్ట్రం తరఫున ఆడే అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డాడు.
33 ఏళ్ల కరుణ్ ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. కరుణ్.. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కరుణ్ తన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ చేశాక కరుణ్ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తాజా ప్రదర్శన తర్వాత కరుణ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చాడు. కరుణ్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment