వెస్టిండీస్ 333/4
కోల్‌కతా: భారత పర్యటనను వెస్టిండీస్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు నిలకడగా ఆడుతోంది. నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. వెటరన్ ఆటగాడు చందర్‌పాల్ (130 బంతుల్లో 91 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో పాటు దేవ్ నారాయణ్ (105 బంతుల్లో 83 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 170 పరుగులు జోడించారు.
కీరన్ పావెల్ (121 బంతుల్లో 64; 12 ఫోర్లు), డారెన్ బ్రేవో (79 బంతుల్లో 61; 12 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. అంతకు ముందు వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (25 బంతుల్లో 18; 3 ఫోర్లు)తో పాటు శామ్యూల్స్ (12) విఫలమయ్యాడు. పేసర్ ఇంతియాజ్ అహ్మద్ ఈ ఇద్దరినీ అవుట్ చేయగా, ఆర్పీ సింగ్, ఆలమ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.