Practise match
-
T20 World Cup: ఓటమితో ముగిసిన ‘సాధన’
పెర్త్: టి20 ప్రపంచకప్ అధికారిక వామప్ మ్యాచ్‌లకు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు గురువారం అదే జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. బౌన్సీ పిచ్ ఉండే ‘వాకా’ మైదానంలో పెర్త్ పేస్ బౌలర్లు టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ (41 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), డార్సీ షార్ట్ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా, హర్షల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (55 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా (17), దినేశ్ కార్తీక్ (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అయితే టీమిండియా టాప్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. రోహిత్, సూర్య గత మ్యాచ్‌లో ఆడగా, కోహ్లి రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం స్థానిక అభిమానులను నిరాశపర్చింది. అయితే మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ ఫీల్డింగ్‌లో మాత్రం మైదానమంతటా చురుగ్గా వ్యవహరించారు. పెర్త్నుంచి బ్రిస్బేన్ చేరుకునే భారత జట్టు ఈ నెల 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్‌లలో తలపడుతుంది. 23న తమ తొలి పోరు లో పాకిస్తాన్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. -
సమరానికి ‘సన్నాహకం’
ఉ. గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం అడిలైడ్: ఫిట్నెస్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్... ఎవరి సామర్థ్యం ఏంటో... ఎవరు అందుబాటులో ఉంటారో కూడా తెలిసిపోయింది. ఇక అసలు సమరానికి ముందు అస్త్రాలను పరీక్షించుకోవడం ఒక్కటే మిగిలింది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) ఆస్ట్రేలియాతో భారత్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అఫ్ఘానిస్తాన్‌తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్నా... అందులో ఎలాగూ ధోనిసేనదే పైచేయి అవుతుంది. కాబట్టి జట్టును పూర్తిస్థాయిలో పరీక్షిం చుకునేందుకు ఈ వార్మప్ మ్యాచే అత్యంత కీలకం కానుంది. దాదాపుగా ప్రపంచకప్‌లో ఆడే తుది జట్టుతోనే బరిలోకి దిగనున్నారు. గత రెండు నెలలుగా ఆసీస్ గడ్డపై ఒక్క విజయం కూడా సాధించలేకపోయినా... కెప్టెన్ ధోని మాత్రం పూర్తి ధీమాగా కనిపిస్తున్నాడు. టెస్టు, ముక్కోణపు సిరీస్ ఫలితాలు తమపై ప్రభావం చూపవని చెబుతున్నాడు. ఫామ్ లేక ఇబ్బందులుపడుతున్న కోహ్లితో పాటు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన రోహిత్, భువనేశ్వర్, జడేజాల ప్రదర్శన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు తొలగాలంటే రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి రావాలి. అదే సమయంలో ధోని వ్యూహాల్లో జడేజాది కీలక పాత్ర. అతను కూడా భుజం గాయం నుంచి కోలుకున్నాడు. వీళ్లందరూ ఏఏ స్థానాల్లో ఎలా ఆడతారనే దానిపైనే అందరూ దృష్టిపెట్టారు. ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లు ఆఖరి చాన్స్. ఇందులో విఫలమైతే రోహిత్‌తో పాటు రహానే ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో ఉమేశ్‌కు బదులుగా మోహిత్ శర్మకు అవకాశం దక్కొచ్చు. మోకాలి గాయంతో ఇషాంత్ టోర్నీకి దూరం కావడం జట్టు అవకాశాలను క్లిష్టతరం చేసింది. ఆసీస్ వాతావరణ పరిస్థితుల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగకరంగా ఉండేది. స్పిన్‌లో అశ్విన్ వైపు మొగ్గుతారా? అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా? అనేది ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా లేకపోవడంతో జట్టు మొత్తాన్ని పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది. -
ఇక ఆటపై దృష్టి
నేటి నుంచి భారత్‌కు ప్రాక్టీస్ మ్యాచ్ శుక్రవారం జట్టుతో చేరనున్న ధోని అడిలైడ్: భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫిల్ హ్యూస్ మైదానంలో గాయపడటం... ఆ తర్వాత అతను మృతి చెందడంతో వారం రోజుల పాటు క్రికెట్ గురించి ఎవరూ మాట్లాడలేదు. అంతా హ్యూస్ గురించే చర్చ. బుధవారం హ్యూస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇక గురువారం నుంచి మళ్లీ క్రికెట్ మీద దృష్టి సారించనున్నారు. గ్లెనెల్గ్‌లోని గ్లిడొరెల్ స్టేడియంలో జరిగే రెండు రోజుల మ్యాచ్‌లో భారత్... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో తలపడుతుంది. హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన విరాట్, రోహిత్, విజయ్ కూడా ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ముందు ప్రాక్టీస్ కోసం ఇదే చివరి అవకాశం కాబట్టి... తుది జట్టులో ఉండే ఆటగాళ్లందరికీ ఎక్కువ అవకాశం ఇవ్వాలని జట్టు భావిస్తోంది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ రాణించారు. అయితే ఆ తర్వాత ఒకట్రెండు ప్రాక్టీస్ సెషన్లలో మాత్రమే పాల్గొన్నారు. చేతి గాయం నుంచి కోలుకున్న ధోని శుక్రవారం సాయంత్రం భారత జట్టుతో చేరతాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే... 9 నుంచి అడిలైడ్‌లోనే జరిగే తొలి టెస్టులో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది ఆసక్తికరం. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
ఇంగ్లండ్ గడ్డపై భారత్ బోణి ప్రాక్టీస్ మ్యాచ్‌లో డెర్బీషైర్‌పై గెలుపు డెర్బీ: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఆత్మ విశ్వాసాన్ని పెంచే ఫలితం లభించింది. మూడేళ్ల క్రితం ఇదే గడ్డపై కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా గెలువని భారత్... ఈ సారి ప్రధాన సిరీస్‌కు ముందు బోణి చేసింది. గురువారం ఇక్కడ ముగిసిన మూడు రోజుల మ్యాచ్‌లో ధోనిసేన 5 వికెట్ల తేడాతో డెర్బీషైర్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ మూడో రోజు డెర్బీషైర్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 156 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. గాడెల్మన్ (56 నాటౌట్), హ్యూస్ (36 నాటౌట్) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ 142 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. మురళీ విజయ్ (41 రిటైర్డ్ అవుట్), రహానే (39 రిటైర్డ్ అవుట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ 5 వికెట్లకు 143 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ధావన్ (9), రోహిత్ శర్మ (10) విఫలం కాగా... తొలి టెస్టులో స్థానం ఆశిస్తున్న గౌతం గంభీర్ (21 నాటౌట్)కు కాస్త బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 9నుంచి నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు జరుగుతుంది. -
రాణించిన పుజారా, బిన్నీ
భారత్ 341/6 డిక్లేర్డ్ డెర్బీ: ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ నిలకడైన ఆటతీరు ప్రదర్శించారు. డెర్బీషైర్‌తో జరుగుతున్న ఈ మూడు రోజుల మ్యాచ్‌లో రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా జట్టుకు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. చతేశ్వర్ పుజారా (131 బంతుల్లో 81 రిటైర్డ్ అవుట్; 13 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (111 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ధోని (46), జడేజా (45), కోహ్లి (36) ఫర్వాలేదనిపించగా... ధావన్ (6) , విజయ్ (6) విఫలమయ్యారు. పుజారా, ధోని కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించడం విశేషం. గురువారం మ్యాచ్‌కు చివరి రోజు. -
తేలిపోయిన భారత బౌలర్లు
లెస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా రాబ్సన్, స్మిత్ సెంచరీలు లెస్టర్‌షైర్: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ‘డ్రా’తో ఆరంభించింది. బౌలర్లు తేలిపోవడంతో లెస్టర్‌షైర్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా రెండోరోజు ఆట పూర్తిగా రద్దు కాగా... చివరి రోజు 62 ఓవర్ల ఆట సాధ్యమైంది. లెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసి 16 పరుగుల ఆధిక్యం సంపాదించింది. లెస్టర్‌షైర్‌ను ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. కెప్టెన్ ధోని 10 మంది బౌలర్లను మార్చినా లాభం లేకుండా పోయింది. ఓపెనర్ రాబ్సన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ గ్రెగ్ స్మిత్ భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. ఇద్దరూ సెంచరీలతో రాణించారు. చివరికి రాబ్సన్ (146 బంతుల్లో 126; 24 ఫోర్లు), స్మిత్ (102 బంతుల్లో 101; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. వీళ్లిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత రెడ్‌ఫ్రెన్ ధాటిగా బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. లెస్టర్‌షైర్ జట్టు ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత వర్షం కురవడంతో స్కోరు 349/5 పరుగుల దగ్గర మ్యాచ్ నిలిచిపోయింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను ముగించేందుకు అంగీకరించారు. భారత బౌలర్లలో ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టగా, పంకజ్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు. -
ప్రతీకారానికి ‘ప్రాక్టీస్’
ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన మొదలు నేటి నుంచి లెస్టర్‌తో మూడు రోజుల మ్యాచ్ లీసెస్టర్: సరిగ్గా మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. 0-4 తేడాతో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన ధోనిసేన... ఆ పర్యటనలో కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ మూడేళ్లలో పరిస్థితి మారింది. ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన పేలవంగా మారింది. కాబట్టి గత సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇదే లక్ష్యంతో ఇంగ్లండ్ చేరిన భారత్ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు... నేటి నుంచి తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. లెస్టర్‌షైర్‌తో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో దాదాపుగా ప్రధాన ఆటగాళ్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత పర్యటనలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉన్నా కూడా భారత్ చిత్తుగా ఓడింది. అప్పటి జట్టులో ఉన్న ధోని, గంభీర్, ఇషాంత్ శర్మలకు మాత్రమే ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది. కోహ్లి, పుజారాలాంటి యువ క్రికెటర్లందరికీ ఈ సిరీస్ పెద్ద పరీక్ష. -
తిమ్మయ్య స్థానంలో యువరాజ్ వాల్మీకి
ప్రపంచకప్ హాకీ జట్టులో మరో మార్పు హేగ్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచకప్ మొదలుకాక ముందే భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో ఫార్వర్డ్ నికిన్ తిమ్మయ్య టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో యువరాజ్ వాల్మీకిని తీసుకున్నారు. కుడి తొడ కండరంలో చీలిక వల్ల తిమ్మయ్యకు నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. రెండు రోజుల కిందట ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడటంతో స్ట్రయికర్ రమణ్‌దీప్ కూడా ప్రపంచకప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వాల్మీకి మంగళవారం రాత్రి హేగ్‌కు బయలుదేరి వెళ్లాడు. వరల్డ్‌కప్‌లో తన సత్తా మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన వాల్మీకి 2011లో అరంగేట్రం చేసి 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. -
రాణించిన పూనమ్, మిథాలీ
ఐర్లాండ్‌పై భారత్ గెలుపు మహిళల టి20 ప్రాక్టీస్ మ్యాచ్ సావేర్ (బంగ్లాదేశ్): మహిళల టి20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (40 బంతుల్లో 50; 7 ఫోర్లు), మిథాలీ రాజ్ (34 బంతుల్లో 42; 7 ఫోర్లు), మంధనా (17 బంతుల్లో 20; 2 ఫోర్లు) రాణించారు. మెక్‌కార్టీ, టైస్, ఓ రిలే తలా ఓ వికెట్ తీశారు. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. షిల్లింగ్టన్ (43 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. శిఖా పాండే 3, సోనియా 2 వికెట్లు పడగొట్టారు. -
‘విశ్వాసం’ పెరిగింది
వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం 20 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి మెరిసిన కోహ్లి, రైనా ఢాకా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి కోహ్లి, రైనా, ధోని... ఒక టి20 మ్యాచ్‌లో భారత్ గెలవడానికి ఈ ముగ్గురూ ఆడితే చాలు. బుధవారం ఢాకాలో అదే జరిగింది. ధోనికి మ్యాచ్ ప్రాక్టీస్, కోహ్లికి ఫామ్, రైనాకు ఆత్మవిశ్వాసం... ఈ మూడూ ఒకే మ్యాచ్‌లో వచ్చాయి. దీంతో లో స్కోరింగ్‌గా సాగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లలో భారత్ ఒక్కసారిగా భారీ స్కోరుతో ఉత్సాహం పెంచింది. దీనికి తోడు బౌలర్లూ సమయోచితంగా స్పందించడంతో ప్రపంచకప్‌కు ముందు భారత్ ఖాతాలో ఓ వార్మప్ విజయం చేరింది. షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ 20 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఓపెనర్లు, యువరాజ్ విఫలం కావడం, పేసర్లు గాడిలో పడకపోవడం, క్యాచ్‌లు వదిలేయడం.. ఈ మూడు అంశాలూ కాస్త ఇబ్బందిపెట్టినా మొత్తం మీద భారత్‌కు ఇది ఊరట. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా... భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (48 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డాడు. రైనా (31 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ చేశాడు. కోహ్లి, రైనా నాలుగో వికెట్‌కు 8.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. కెప్టెన్ ధోని (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సమయోచితంగా ఆడి కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు 5.1 ఓవర్లలో 58 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఓపెనర్ లంబ్ (25 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొయిన్ అలీ (38 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్), బట్లర్ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. అయితే భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు. కాపాడిన కోహ్లి, రైనా ఇంగ్లండ్ జట్టు స్పిన్నర్ అలీతో బౌలింగ్ ప్రారంభించింది. 7 బంతులు ఆడిన రోహిత్ షార్ట్ బంతిని పుల్ ఆడబోయి హేల్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. ధావన్ రెండు బౌండరీలతో ధీమాగా కనిపించినా... ట్రెడ్‌వెల్ అద్భుతమైన క్యాచ్‌కి అవుటయ్యాడు. యువీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. దీంతో భారత్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో కోహ్లి, రైనా వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. జోర్డాన్ బౌలింగ్‌లో రైనా రెండు వరుస బౌండరీలతో గాడిలో పడ్డాడు. మరో ఎండ్‌లో కోహ్లి ప్యారీ బౌలింగ్‌లో 2 వరుస బౌండరీలు బాదితే... ఇదే బౌలర్ బంతిని రైనా మిడ్ వికెట్‌లోకి సిక్సర్ కొట్టాడు. 14వ ఓవర్లో భారత్ 100 మార్కును చేరుకుంది. 15వ ఓవర్లో రైనా ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. బొపారా వేసిన ఈ ఓవర్లో రైనా 4, 4, 6తో 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికీ ఓ ఫోర్ కొట్టి, ఆ తర్వాతి బంతికి డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయని కెప్టెన్ ధోని ఈసారి బ్యాటింగ్‌కు వచ్చాడు. దాదాపు నెలరోజులు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా మహీ టచ్‌లోనే కనిపించాడు. డెర్న్‌బ్యాచ్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. డెర్న్‌బ్యాచ్ బౌలింగ్‌లోనే కవర్స్‌లోకి బౌండరీ కొట్టిన కోహ్లి 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధోని, కోహ్లి కలిసి భారత్‌కు భారీస్కోరు అందించారు. ఆరంభం బాగున్నా... భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు హేల్స్, లంబ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. 5 ఓవర్లలోనే ఈ జోడీ 43 పరుగులు జోడించింది. ఐదో ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్... హేల్స్‌ను బౌల్డ్ చేశాడు. మరో మూడు ఓవర్ల తర్వాత రైనా బౌలింగ్‌లో లంబ్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వేగం తగ్గింది. చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 51 పరుగులు అవసరం కాగా... ఆరోన్ వేసిన 18వ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో షమీ... బొపారాను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో బట్లర్ భారీ సిక్సర్ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 25 పరుగులు అవసరం కాగా... జడేజా వేసిన ఈ ఓవర్లో బట్లర్ అవుటయ్యాడు. దీంతో భారత్ అలవోకగా గెలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హేల్స్ (బి) డె ర్న్బ్యాచ్ 5; ధావన్ (సి) ట్రెడ్‌వెల్ (బి) బ్రెస్నన్ 14; కోహ్లి నాటౌట్ 74; యువరాజ్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 1; రైనా (సి) జోర్డాన్ (బి) బొపారా 54; ధోని నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-15; 2-30; 3-39; 4-120. బౌలింగ్: మొయిన్ అలీ 1-0-4-0; డెర్న్‌బ్యాచ్ 3-0-27-1; బ్రెస్నన్ 3-0-31-1; జోర్డాన్ 4-0-37-1; బొపారా 2-0-25-1; బ్రాడ్ 2-0-14-0; ట్రెడ్‌వెల్ 4-0-20-0; ప్యారీ 1-0-17-0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: లంబ్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 36; హేల్స్ (బి) భువనేశ్వర్ 16; మొయిన్ అలీ (సి) రహానే (బి) జడేజా 46; మోర్గాన్ (సి) యువరాజ్ (బి) అశ్విన్ 16; బట్లర్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 30; బొపారా (బి) షమీ 6; బ్రెస్నన్ నాటౌట్ 3; జోర్డాన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-43; 2-58; 3-87; 4-128; 5-145; 6-157. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-27-1; షమీ 3-0-29-1; అశ్విన్ 4-0-20-1; రైనా 4-0-23-1; జడేజా 3-0-23-2; మిశ్రా 2-0-21-0; ఆరోన్ 1-0-13-0. -
గాడిలో పడ్డారు
వాంగేరి: న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు ఎట్టకేలకు కాస్త గాడిలో పడ్డారు. ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలెవన్ జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగారు. దీంతో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ ఎలెవన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 262 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యువ బౌలర్ ఈశ్వర్ పాండే (3/42) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో ఘోరంగా విఫలమైన ఇషాంత్ శర్మ (2/58), అశ్విన్ (2/45) రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టి ఫర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. ధోని, కోహ్లి, జడేజాలకు విశ్రాంతి రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌గా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు కెప్టెన్ ధోనితో సహా విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ బౌలర్లు షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతినిచ్చారు. టెస్టు స్పెషలిస్టులు మురళీ విజయ్, పుజారా, జహీర్ ఖాన్‌లతోపాటు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, అంబటి రాయుడు, ఈశ్వర్ పాండే వంటి వారికి అవకాశం లభించింది. కాగా, డెవ్కిక్ సారథ్యంలోని కివీస్ ఎలెవన్ జట్టుకు వర్కర్-ఒడోనెల్ జోడీ 81 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్నిచ్చింది. అయితే లంచ్ అనంతరం వర్కర్ (33)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా అశ్విన్... భారత్‌కు తొలి బ్రేక్ ఇవ్వగా, ఆ వెంటనే డెవ్కిక్ (9)ను జహీర్ వెనక్కి పంపించాడు. ఈ దశలో హిక్కీ (85 బంతుల్లో 45; 7 ఫోర్లు) జతగా ఒడోనెల్ కివీస్ ఎలెవన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే రహానే క్యాచ్‌తో ఒడోనెల్ (124 బంతుల్లో 80; 13 ఫోర్లు)ను ఇషాంత్ ఔట్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి కివీస్ ఎలెవన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. యువ పేసర్ ఈశ్వర్ పాండే చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసురుతూ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 235 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన కివీస్ జూనియర్ జట్టు మరో ఆరు ఓవర్ల తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం మురళీ విజయ్ (19 బ్యాటింగ్), శిఖర్ ధావన్ (16 బ్యాటింగ్)లు కివీస్ బౌలర్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటూ క్రీజులో నిలిచారు. స్కొరు వివరాలు న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: వర్కర్ (ఎల్బీ) అశ్విన్ 33, ఒడోనెల్ (సి) రహానే (బి) ఇషాంత్ 80, డెవ్కిక్ (సి) సాహా (బి) జహీర్ 9, హిక్కీ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 45, హిక్స్ (సి) రాయుడు (బి) ఉమేశ్ 5, వాల్ష్ (సి) రోహిత్ (బి) పాండే 1, సీఫర్ట్ (సి) సాహా (బి) పాండే 8, బౌల్ట్ (సి) ధావన్ (బి) అశ్విన్ 8, బాడెన్హాస్ట్ (నాటౌట్) 34, టుగాగ (సి) జహీర్ (బి) పాండే 8, మెక్పీక్ (నాటౌట్) 16, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం: (78 ఓవర్లలో 9 వికెట్లకు) 262 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-81, 2-92, 3-149, 4-155, 5-160, 6-171, 7-196, 8-209, 9-235. బౌలింగ్: జహీర్ 18-6-42-1, ఉమేశ్ 18-4-70-1, ఇషాంత్ 14-2-58-2, అశ్విన్ 14-2-45-2, ఈశ్వర్ పాండే 14-5-42-3. -
ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు
బెనోని: కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు రెండు రోజుల ప్రాక్టీస్ లభిస్తుందని భావించిన ధోనిసేనకు వరుణుడు అడ్డు తగిలాడు. దక్షిణాఫ్రికా ఇన్విటేషనల్ ఎలెవన్‌తో రెండు రోజుల పాటు జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో రోజు వర్షం ముప్పు లేకపోయినా పూర్తి స్థాయి ప్రాక్టీస్ సెషన్ కోసం భారత జట్టు మేనేజ్మెంట్ మ్యాచ్ రద్దువైపు మొగ్గుచూపింది. శుక్రవారం వర్షం ఆటంకం కల్పించినా... ధోనిసేన మాత్రం యథావిధిగా తమ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. మ్యాచ్ అధికారుల అనుమతితో ప్రధాన పిచ్ చుట్టూ నెట్స్ ఏర్పాటు చేసి అందులోనే కసరత్తులు చేస్తూ... ఆటగాళ్లందరూ మూడు గ్రూపులుగా విడిపోయి ఫీల్డింగ్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. నెట్ బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో బ్యాట్స్‌మెన్‌కు భారత బౌలర్లే బౌలింగ్ చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ జంటలుగా ప్రాక్టీస్ చేయడం ఇక్కడ విశేషం. మొదట ధావన్, విజయ్, తర్వాత పుజారా, కోహ్లి... ఆ తర్వాత రోహిత్, రహానే, చివర్లో ధోని, అశ్విన్ బ్యాటింగ్ చేశారు. రాయుడు, జడేజాలు కొద్దిసేపు బంతులు విసిరిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చారు. జహీర్, ఇషాంత్, షమీ, అశ్విన్‌లు వరుసగా బౌలింగ్ చేయగా, తర్వాత భువనేశ్వర్, ఓజాలు ప్రాక్టీస్ చేశారు. సెషన్ చివర్లో ఉమేశ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాక్టీస్ సెషన్ గమనిస్తే ఈనెల 18 నుంచి జరిగే తొలి టెస్టు కోసం తుది జట్టు ఎంపికపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. రెండో రోజు కూడా టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లుగా జహీర్, ఇషాంత్, షమీలకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్‌లోనూ శ్రమిస్తా ‘ఐసీసీ అవార్డు లభించినందుకు ఆనందంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవడం ముఖ్యం కాదు. కానీ గెలవాలన్న కోరిక మాత్రం ఎప్పుడూ ఉండాలి. విజయం సాధించే దిశగా ఇదో చిన్న అడుగు మాత్రమే. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా శ్రమిస్తా. వీలైనంత ఎక్కువ కాలం దేశానికి ఆడటానికి ప్రయత్నిస్తా’ - పుజారా (భారత బ్యాట్స్‌మన్) తుది జట్టులో చోటు ఆశిస్తున్నా ‘ఉపఖండం వెలుపలా ఆడి భారత్‌ను గెలిపించాలన్నది నా పెద్ద లక్ష్యాల్లో ఒకటి. భారత్‌లో చాలా క్రికెట్ ఆడాను. కానీ దక్షిణాఫ్రికాలో ఆడటం ప్రత్యేకమైన అనుభూతి. ప్రస్తుతం దానిపైనే దృష్టిపెట్టా. తుది జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నా’ - ఓజా (భారత స్పిన్నర్) -
రాణించిన గేల్, శామ్యూల్స్
కోల్‌కతా: ఉత్తరప్రదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ (48 బంతుల్లో 58; 11 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (47 బంతుల్లో 58; 9 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించగా చివరి రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో ఐదు వికెట్లకు 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గేల్ ఈసారి ఆకట్టుకున్నాడు. దినేశ్ రామ్‌దిన్ (53 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్) నిలకడగా ఆడాడు. పీయూష్ చావ్లాకు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు 206/5 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన యూపీ 372/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. పర్వీందర్ సింగ్ (112; 17 ఫోర్లు; 2 సిక్స్) శతకాన్ని సాధించాడు. ఆమిర్ ఖాన్ (128 బంతుల్లో 47; 7 ఫోర్లు), పీయూష్ చావ్లా (58 బంతుల్లో 46; 9 ఫోర్లు) చివర్లో రాణించారు. పెరుమాల్, కాట్రెల్ లకు మూడు, బెస్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాన్పూర్‌లో భారత్, విండీస్ మూడో వన్డే న్యూఢిల్లీ: భారత, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ కాన్పూర్‌లో జరుగనుంది. ‘ఈనెల 27న జరిగే వన్డే మ్యాచ్ వేదికను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు కేటాయిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ నాతో చెప్పారు’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. -
దీటుగా ఆడుతున్న యూపీ
కోల్‌కతా: భారత్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టును ఉత్తర ప్రదేశ్ ఆటగాళ్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పర్వీందర్ సింగ్ (101 బంతుల్లో 78 బ్యాటింగ్; 11 ఫోర్లు; 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఈ మూడు రోజుల మ్యాచ్‌లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో ఐదు వికెట్లకు 206 పరుగులు సాధించింది. ఓపెనర్ ముకుల్ డాగర్ (74 బంతుల్లో 42; 8 ఫోర్లు) శుభారంభాన్నిచ్చాడు. 96 పరుగులకు నాలుగు వికెట్లు పడిన దశలో పర్వీందర్.. ప్రశాంత్ గుప్తా (86 బంతుల్లో 39; 6 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఓపిగ్గా విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. పెరుమాళ్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అంతకుముందు 333/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ 103.3 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటయింది. సీనియర్ బ్యాట్స్‌మన్ చందర్‌పాల్ (153 బంతుల్లో 112; 15 ఫోర్లు; 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. దేవ్ నారాయణ్ (129 బంతుల్లో 94; 10 ఫోర్లు; 2 సిక్స్) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 197 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇంతియాజ్ అహ్మద్ వీరిని ఎల్బీగా అవుట్ చేశాడు. చివర్లో టినో బెస్ట్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు; 3 సిక్స్) రెచ్చిపోవడంతో జట్టుకు వేగంగా పరుగులు వచ్చాయి. ఇంతియాజ్ ఐదు వికెట్లు, ఆర్పీ సింగ్ మూడు వికెట్లు తీశారు. -
వెస్టిండీస్ 333/4
కోల్‌కతా: భారత పర్యటనను వెస్టిండీస్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు నిలకడగా ఆడుతోంది. నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. వెటరన్ ఆటగాడు చందర్‌పాల్ (130 బంతుల్లో 91 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో పాటు దేవ్ నారాయణ్ (105 బంతుల్లో 83 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 170 పరుగులు జోడించారు. కీరన్ పావెల్ (121 బంతుల్లో 64; 12 ఫోర్లు), డారెన్ బ్రేవో (79 బంతుల్లో 61; 12 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. అంతకు ముందు వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (25 బంతుల్లో 18; 3 ఫోర్లు)తో పాటు శామ్యూల్స్ (12) విఫలమయ్యాడు. పేసర్ ఇంతియాజ్ అహ్మద్ ఈ ఇద్దరినీ అవుట్ చేయగా, ఆర్పీ సింగ్, ఆలమ్లకు ఒక్కో వికెట్ దక్కింది.