తేలిపోయిన భారత బౌలర్లు
లెస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
రాబ్సన్, స్మిత్ సెంచరీలు
లెస్టర్‌షైర్: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ‘డ్రా’తో ఆరంభించింది. బౌలర్లు తేలిపోవడంతో లెస్టర్‌షైర్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా రెండోరోజు ఆట పూర్తిగా రద్దు కాగా... చివరి రోజు 62 ఓవర్ల ఆట సాధ్యమైంది. లెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసి 16 పరుగుల ఆధిక్యం సంపాదించింది. లెస్టర్‌షైర్‌ను ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.
కెప్టెన్ ధోని 10 మంది బౌలర్లను మార్చినా లాభం లేకుండా పోయింది. ఓపెనర్ రాబ్సన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ గ్రెగ్ స్మిత్ భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. ఇద్దరూ సెంచరీలతో రాణించారు. చివరికి రాబ్సన్ (146 బంతుల్లో 126; 24 ఫోర్లు), స్మిత్ (102 బంతుల్లో 101; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. వీళ్లిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత రెడ్‌ఫ్రెన్ ధాటిగా బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. లెస్టర్‌షైర్ జట్టు ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత వర్షం కురవడంతో స్కోరు 349/5 పరుగుల దగ్గర మ్యాచ్ నిలిచిపోయింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను ముగించేందుకు అంగీకరించారు. భారత బౌలర్లలో ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టగా, పంకజ్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు.