సిరీస్‌ విజయమే లక్ష్యంగా... | India vs England 2nd ODI today | Sakshi
Sakshi News home page

సిరీస్‌ విజయమే లక్ష్యంగా...

Published Sun, Feb 9 2025 2:41 AM | Last Updated on Sun, Feb 9 2025 2:41 AM

India vs England 2nd ODI today

నేడు భారత్, ఇంగ్లండ్‌ రెండో వన్డే 

గెలిస్తే సిరీస్‌ టీమిండియా సొంతం  

సమం చేయడంపై ఇంగ్లండ్‌ దృష్టి 

మ.గం.1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌, స్పోర్ట్స్‌18లలో ప్రసారం

ఇంగ్లండ్‌పై టి20 సిరీస్‌ జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ శుభారంభం చేసిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా ఫామ్‌లో ఉన్న టీమిండియా ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగుతున్న భారత్‌ను నిలువరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌ ఈ సారైనా కోలుకొని పోటీనిస్తుందా చూడాలి.  

కటక్‌: ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై తమ సత్తాను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బారాబతి స్టేడియంలో నేడు జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 38.4 ఓవర్లలోనే ఛేదన పూర్తి చేసిన భారత్‌ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే మరో మ్యాచ్‌ కూడా రోహిత్‌ సేన ఖాతాలో చేరుతుంది.

టి20ల్లో చిత్తుగా ఓడి తొలి వన్డేలో కూడా 248కే పరిమితమైన ఇంగ్లండ్‌ మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్‌తో తలపడిన ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌లే గెలిచి 25 ఓడింది.  

కోహ్లి సిద్ధం... 
గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పూర్తి ఫిట్‌గా సిద్ధమయ్యాడు. రెండో వన్డేలో అతను బరిలోకి దిగడం ఖాయమైంది. కోహ్లి కూడా చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. లయ అందుకునేందుకు అతనికి ఇదే సరైన అవకాశం. అయితే ఎవరి స్థానంలో విరాట్‌ ఆడతాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో చెప్పినదాని ప్రకారం శ్రేయస్‌ను తప్పించి కోహ్లిని తీసుకోవాలి. 

కానీ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్‌ను పక్కన పెడితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు రావచ్చు. కోచ్‌ గంభీర్‌ సాధారణంగా ఓపెనింగ్‌ ఎడమ, కుడిచేతివాటం కాంబినేషన్‌ను ఇష్టపడతాడు. అలా చూస్తే శ్రేయస్‌పైనే వేటు వేసి జైస్వాల్‌ను ఆడించవచ్చు. కానీ చాంపియన్స్‌ ట్రోఫీ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రయోగాలు చేయకుండా జైస్వాల్‌ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమవుతుంది. 

మరో వైపు రాహుల్‌ స్థానంలో కీపర్‌గా పంత్‌ను ఆడించే ఆలోచన కూడా ఉంది. లెఫ్టార్మ్‌ పేసర్‌ అర్ష్ దీప్‌ సింగ్‌ను పరీక్షించేందుకు రాణాను పక్కన పెట్టాలనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ సిరీస్‌ గెలవాలని భావిస్తే భారత జట్టు మార్పులపై దృష్టి పెట్టకపోవచ్చు. కానీ చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఈ సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షించాలనే ఆలోచన ఉంటే మాత్రం మార్పులు ఖాయం. 

సీనియర్‌ పేసర్‌ షమీ గత మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ బ్యాటింగ్‌లో రాణించడం సానుకూలాంశం. అయితే అన్నింటికి మించి కెపె్టన్‌ రోహిత్‌ ఫామ్‌లోకి రావడం భారత్‌కు ముఖ్యం. చాలా కాలంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్‌ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. గిల్, పాండ్యా, జడేజాలతో మన బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది.  

గెలిపించేదెవరు? 
ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌లలో ఓడిన ఇంగ్లండ్‌ ఆట దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. పేరుకు భారీ బ్యాటింగ్‌ లైనప్‌ కనిపిస్తున్నా ఆ జట్టు వ్యూహాల్లో పదును లోపించింది. గుడ్డిగా బ్యాట్‌లు ఊపడం తప్ప ఆటగాళ్లు విఫలమవుతున్న చోట రెండో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కోచ్‌ మెక్‌కలమ్‌ ప్రణాళికలు ఏవీ పని చేయడం లేదు. 

భారత గడ్డపై అనుభవం ఉన్న బట్లర్‌ మాత్రమే ఎంతో కొంత రాణిస్తుండగా బెతెల్‌ కాస్త పట్టుదలగా ఆడగలిగాడు. జట్టు ఆధారపడుతున్న రూట్, బ్రూక్‌ స్థాయికి తగ్గ ఆటను కనబర్చాల్సి ఉంది. ముఖ్యంగా బ్రూక్‌ 5 టి20లు, వన్డే కలిపి 91 పరుగులే చేశాడు. డకెట్‌ ఇంకా వన్డే ఓపెనర్‌గా కుదురుకోకపోగా, సాల్ట్‌ మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. 

ఆర్చర్, కార్స్‌ పేస్‌ భారత బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, రషీద్‌ తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో మరో పేసర్‌ వుడ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. 40 ఓవర్లలోపే భారత్‌ తొలి వన్డే ముగించడం ఇంగ్లండ్‌ బౌలింగ్‌ బలహీనతను కూడా చూపించింది. దీనిని ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్  ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్‌/ పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్  దీప్, షమీ 
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్  ),సాల్ట్, రూట్, బ్రూక్,డకెట్,  లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్‌.  

పిచ్, వాతావరణం 
ఈ మైదానంలో ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ జరుగుతోంది. మొదటినుంచి ఇక్కడి పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సారి కూడా పరుగుల వరద ఖాయం. వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement