![India vs England last ODI today at Narendra Modi Stadium](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/india.jpg.webp?itok=cJK1Wth9)
నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే
అమితోత్సాహంతో టీమిండియా
విజయంతో ముగించాలని ఇంగ్లండ్
మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్18లలో ప్రత్యక్ష ప్రసారం
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టి20ల్లో చిత్తు చేసిన తర్వాత వన్డే సిరీస్ కూడా గెలుచుకొని భారత జట్టు ఒక లాంఛనం ముగించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒకే ఒక వన్డే అందుబాటులో ఉంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది కాబట్టి బెంచీపై ఉన్న ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్ ఒక అవకాశం ఇస్తుందా లేక విజయాల బాటలో ఉన్న జట్టును కొనసాగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది చూడాలి.
మరోవైపు ఇంగ్లండ్ కోణంలో ఇది కాస్త పరువు దక్కించుకునే ప్రయత్నం. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌లలో 6 ఓడి నిరాశలో మునిగిన టీమ్ కనీసం చివరి పోరులోనైనా గెలిచి పర్యటనను ముగించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం ఆఖరి పోరుకు వేదిక కానుంది.
అహ్మదాబాద్: భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల పర్యటన చివరి అంకానికి చేరింది. సిరీస్ ఫలితం తేలిపోయిన తర్వాత నేడు మొతేరా లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే నామమాత్రపు చివరి వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తాజా ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాకు మరో విజయం కూడా కష్టం కాకపోవచ్చు. ఇక్కడా గెలిచి సిరీస్‌ను 3–0తో సాధించాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది.
మరోవైపు కొంత కాలం క్రితం వరకు అభేద్యమైన టీమ్‌గా కనిపించిన ఇంగ్లండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమై చేతులెత్తేసింది. ఈ పోరు తర్వాత ఇరు జట్లు చాంపియన్స్ ట్రోఫీ బాట పడతాయి.
కోహ్లి కొడతాడా!
చాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ భారత్ బెంగ తీర్చాడు. చక్కటి సెంచరీతో సత్తా చాటుతూ అతను ఫామ్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ వరుసగా రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తమ విలువను చూపించారు.
పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ స్థానం మారడం వల్ల ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. పంత్‌కు కాకుండా రాహుల్‌కే మరో అవకాశం దక్కవచ్చు. అయితే అన్నింటికి మించి ప్రధాన బ్యాటర్లలో విరాట్ కోహ్లి ప్రదర్శన కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఆసీస్ గడ్డపై తొలి టెస్టు తర్వాత మొదలైన వైఫల్యం రంజీ మ్యాచ్ మీదుగా ఇక్కడ రెండో వన్డే వరకు సాగింది. అ
తని స్థాయిని బట్టి చూస్తే ఎప్పుడైనా చెలరేగిపోగలడు. కానీ అలాంటి ఇన్నింగ్సే ఇంకా రావడం లేదు. 14 వేల మైలురాయికి మరో 89 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్‌లోనే దానిని పూర్తి చేసుకుంటాడా చూడాలి. బౌలింగ్ విభాగంలో షమీ ఇంకా పూర్తిగా తన లయను అందుకోలేదని గత మ్యాచ్‌లో అర్థమైంది.
యువ బౌలర్ హర్షిత్ రాణా కూడా తడబడుతున్నాడు. అతని స్థానంలో అర్‡్షదీప్‌ను ఆడించే విషయంపై మేనేజ్‌మెంట్ చర్చిస్తోంది. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చడం మరో సానుకూలాంశం. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా ఉంది.
బాంటన్‌కు చాన్స్...
ప్రత్యర్థితో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఒక్క ఆటగాడు కూడా తనదైన స్థాయి ప్రదర్శనను కనబర్చి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. రెండు వన్డేల్లో ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేసినా విజయానికి అది సరిపోలేదు. గతంలో చూపించి విధ్వంసకర బ్యాటింగ్ ఇంగ్లండ్ నుంచి రావడం లేదు.
ఓపెనర్లు సాల్ట్, డకెట్ శుభారంభాలు ఇస్తున్నారు కానీ ఆ తర్వాత దానిని ఇతర బ్యాటర్లు కొనసాగించలేకపోతున్నారు. కెపె్టన్ బట్లర్, జో రూట్ మాత్రమే నమ్మకమైన ఆటగాళ్లుగా కనిపిస్తుండగా, రెండో వన్డేలో హ్యారీ బ్రూక్ మరీ నెమ్మదిగా ఆడాడు. ఒవర్టన్ స్థానంలో బాంటన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరోవైపు బౌలింగ్ పూర్తిగా బలహీనంగా కనిపిస్తోంది.
భారత బ్యాటర్ల ముందు ఈ బౌలర్లంతా అనామకుల్లా కనిపిస్తున్నారు. ఏ ఒక్కరిలో కూడా ప్రత్యర్థిని నిలువరించే సత్తా కనిపించడం లేదు. సాఖిబ్ స్థానంలో ఆర్చర్ బరిలోకి దిగవచ్చు. అట్కిన్సన్, వుడ్, రషీద్ ఏమాత్రం రాణిస్తారో చూడాలి.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, అక్షర్, జడేజా, రాణా, షమీ, వరుణ్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, డకెట్, బాంటన్, రూట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ పిచ్. చక్కగా పరుగులు సాధించవచ్చు. వర్షసూచన ఏమాత్రం లేదు. వేడి వాతావరణం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
13 మరో 13 పరుగులు చేస్తే రోహిత్ వన్డేల్లో 11 వేల మైలురాయిని అందుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment