పసికూన ఐర్లాండ్‌పై వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ టీమ్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, ఐర్లాండ్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు.
సాల్ట్‌కు విల్ జాక్స్ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ జాక్ క్రాలే (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (54 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డకెట్‌తో పాటు సామ్ హెయిన్ (4) క్రీజ్లో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, వాన్ వొయెర్కోమ్ ఓ వికెట్ పడగొట్టారు. మరో 25 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో రికార్డు స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది.
ఈ మ్యాచ్‌లో ఇప్పటికే నమోదైన పలు రికార్డులు..
- వన్డే పవర్ ప్లేలో ఇంగ్లండ్ అత్యధిక స్కోర్: 107/2
- 8 ఓవర్లలోనే ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును తాకింది
- వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఫిలిప్ సాల్ట్ (22 బంతుల్లో)
కాగా, ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ రెగ్యులర్ టీమ్ సభ్యులంతా వరల్డ్‌కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ టీమ్‌కు జాక్ క్రాలే నాయకత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment