‘విశ్వాసం’ పెరిగింది
వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం
20 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి
మెరిసిన కోహ్లి, రైనా
ఢాకా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి
కోహ్లి, రైనా, ధోని... ఒక టి20 మ్యాచ్‌లో భారత్ గెలవడానికి ఈ ముగ్గురూ ఆడితే చాలు. బుధవారం ఢాకాలో అదే జరిగింది. ధోనికి మ్యాచ్ ప్రాక్టీస్, కోహ్లికి ఫామ్, రైనాకు ఆత్మవిశ్వాసం... ఈ మూడూ ఒకే మ్యాచ్‌లో వచ్చాయి. దీంతో లో స్కోరింగ్‌గా సాగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లలో భారత్ ఒక్కసారిగా భారీ స్కోరుతో ఉత్సాహం పెంచింది.
దీనికి తోడు బౌలర్లూ సమయోచితంగా స్పందించడంతో ప్రపంచకప్‌కు ముందు భారత్ ఖాతాలో ఓ వార్మప్ విజయం చేరింది. షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ 20 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఓపెనర్లు, యువరాజ్ విఫలం కావడం, పేసర్లు గాడిలో పడకపోవడం, క్యాచ్‌లు వదిలేయడం.. ఈ మూడు అంశాలూ కాస్త ఇబ్బందిపెట్టినా మొత్తం మీద భారత్‌కు ఇది ఊరట.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా... భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (48 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డాడు. రైనా (31 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ చేశాడు. కోహ్లి, రైనా నాలుగో వికెట్‌కు 8.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. కెప్టెన్ ధోని (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సమయోచితంగా ఆడి కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు 5.1 ఓవర్లలో 58 పరుగులు జోడించాడు.
ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఓపెనర్ లంబ్ (25 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొయిన్ అలీ (38 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్), బట్లర్ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. అయితే భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు.
కాపాడిన కోహ్లి, రైనా
ఇంగ్లండ్ జట్టు స్పిన్నర్ అలీతో బౌలింగ్ ప్రారంభించింది. 7 బంతులు ఆడిన రోహిత్ షార్ట్ బంతిని పుల్ ఆడబోయి హేల్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. ధావన్ రెండు బౌండరీలతో ధీమాగా కనిపించినా... ట్రెడ్‌వెల్ అద్భుతమైన క్యాచ్‌కి అవుటయ్యాడు. యువీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు.
దీంతో భారత్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో కోహ్లి, రైనా వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. జోర్డాన్ బౌలింగ్‌లో రైనా రెండు వరుస బౌండరీలతో గాడిలో పడ్డాడు. మరో ఎండ్‌లో కోహ్లి ప్యారీ బౌలింగ్‌లో 2 వరుస బౌండరీలు బాదితే... ఇదే బౌలర్ బంతిని రైనా మిడ్ వికెట్‌లోకి సిక్సర్ కొట్టాడు. 14వ ఓవర్‌లో భారత్ 100 మార్కును చేరుకుంది.
15వ ఓవర్లో రైనా ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. బొపారా వేసిన ఈ ఓవర్లో రైనా 4, 4, 6తో 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికీ ఓ ఫోర్ కొట్టి, ఆ తర్వాతి బంతికి డీప్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయని కెప్టెన్ ధోని ఈసారి బ్యాటింగ్‌కు వచ్చాడు.
దాదాపు నెలరోజులు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా మహీ టచ్‌లోనే కనిపించాడు. డెర్న్‌బ్యాచ్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. డెర్న్‌బ్యాచ్ బౌలింగ్‌లోనే కవర్స్‌లోకి బౌండరీ కొట్టిన కోహ్లి 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధోని, కోహ్లి కలిసి భారత్‌కు భారీస్కోరు అందించారు.
ఆరంభం బాగున్నా...
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు హేల్స్, లంబ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. 5 ఓవర్లలోనే ఈ జోడీ 43 పరుగులు జోడించింది. ఐదో ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్... హేల్స్‌ను బౌల్డ్ చేశాడు. మరో మూడు ఓవర్ల తర్వాత రైనా బౌలింగ్‌లో లంబ్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వేగం తగ్గింది.
చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 51 పరుగులు అవసరం కాగా... ఆరోన్ వేసిన 18వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో షమీ... బొపారాను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్‌లో బట్లర్ భారీ సిక్సర్ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 25 పరుగులు అవసరం కాగా... జడేజా వేసిన ఈ ఓవర్‌లో బట్లర్ అవుటయ్యాడు. దీంతో భారత్ అలవోకగా గెలిచింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హేల్స్ (బి) డె ర్న్‌బ్యాచ్ 5; ధావన్ (సి) ట్రెడ్‌వెల్ (బి) బ్రెస్నన్ 14; కోహ్లి నాటౌట్ 74; యువరాజ్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 1; రైనా (సి) జోర్డాన్ (బి) బొపారా 54; ధోని నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1-15; 2-30; 3-39; 4-120.
బౌలింగ్: మొయిన్ అలీ 1-0-4-0; డెర్న్‌బ్యాచ్ 3-0-27-1; బ్రెస్నన్ 3-0-31-1; జోర్డాన్ 4-0-37-1; బొపారా 2-0-25-1; బ్రాడ్ 2-0-14-0; ట్రెడ్‌వెల్ 4-0-20-0; ప్యారీ 1-0-17-0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: లంబ్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 36; హేల్స్ (బి) భువనేశ్వర్ 16; మొయిన్ అలీ (సి) రహానే (బి) జడేజా 46; మోర్గాన్ (సి) యువరాజ్ (బి) అశ్విన్ 16; బట్లర్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 30; బొపారా (బి) షమీ 6; బ్రెస్నన్ నాటౌట్ 3; జోర్డాన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1-43; 2-58; 3-87; 4-128; 5-145; 6-157.
బౌలింగ్: భువనేశ్వర్ 3-0-27-1; షమీ 3-0-29-1; అశ్విన్ 4-0-20-1; రైనా 4-0-23-1; జడేజా 3-0-23-2; మిశ్రా 2-0-21-0; ఆరోన్ 1-0-13-0.