ఎన్నాళ్లకెన్నాళ్లకు...
ఇంగ్లండ్ గడ్డపై భారత్ బోణి
ప్రాక్టీస్ మ్యాచ్‌లో డెర్బీషైర్‌పై గెలుపు
డెర్బీ: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఆత్మ విశ్వాసాన్ని పెంచే ఫలితం లభించింది. మూడేళ్ల క్రితం ఇదే గడ్డపై కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా గెలువని భారత్... ఈ సారి ప్రధాన సిరీస్‌కు ముందు బోణి చేసింది. గురువారం ఇక్కడ ముగిసిన మూడు రోజుల మ్యాచ్‌లో ధోనిసేన 5 వికెట్ల తేడాతో డెర్బీషైర్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ మూడో రోజు డెర్బీషైర్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 156 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. గాడెల్‌మన్ (56 నాటౌట్), హ్యూస్ (36 నాటౌట్) రాణించారు.
తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ 142 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. మురళీ విజయ్ (41 రిటైర్డ్ అవుట్), రహానే (39 రిటైర్డ్ అవుట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ 5 వికెట్లకు 143 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ధావన్ (9), రోహిత్ శర్మ (10) విఫలం కాగా... తొలి టెస్టులో స్థానం ఆశిస్తున్న గౌతం గంభీర్ (21 నాటౌట్)కు కాస్త బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 9నుంచి నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు జరుగుతుంది.