ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు
బెనోని: కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు రెండు రోజుల ప్రాక్టీస్ లభిస్తుందని భావించిన ధోనిసేనకు వరుణుడు అడ్డు తగిలాడు. దక్షిణాఫ్రికా ఇన్విటేషనల్ ఎలెవన్‌తో రెండు రోజుల పాటు జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో రోజు వర్షం ముప్పు లేకపోయినా పూర్తి స్థాయి ప్రాక్టీస్ సెషన్ కోసం భారత జట్టు మేనేజ్‌మెంట్ మ్యాచ్ రద్దువైపు మొగ్గుచూపింది.
శుక్రవారం వర్షం ఆటంకం కల్పించినా... ధోనిసేన మాత్రం యథావిధిగా తమ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. మ్యాచ్ అధికారుల అనుమతితో ప్రధాన పిచ్ చుట్టూ నెట్స్ ఏర్పాటు చేసి అందులోనే కసరత్తులు చేస్తూ... ఆటగాళ్లందరూ మూడు గ్రూపులుగా విడిపోయి ఫీల్డింగ్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. నెట్ బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో బ్యాట్స్‌మెన్‌కు భారత బౌలర్లే బౌలింగ్ చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ జంటలుగా ప్రాక్టీస్ చేయడం ఇక్కడ విశేషం. మొదట ధావన్, విజయ్, తర్వాత పుజారా, కోహ్లి... ఆ తర్వాత రోహిత్, రహానే, చివర్లో ధోని, అశ్విన్ బ్యాటింగ్ చేశారు. రాయుడు, జడేజాలు కొద్దిసేపు బంతులు విసిరిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చారు.
జహీర్, ఇషాంత్, షమీ, అశ్విన్‌లు వరుసగా బౌలింగ్ చేయగా, తర్వాత భువనేశ్వర్, ఓజాలు ప్రాక్టీస్ చేశారు. సెషన్ చివర్లో ఉమేశ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాక్టీస్ సెషన్ గమనిస్తే ఈనెల 18 నుంచి జరిగే తొలి టెస్టు కోసం తుది జట్టు ఎంపికపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. రెండో రోజు కూడా టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లుగా జహీర్, ఇషాంత్, షమీలకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.
భవిష్యత్‌లోనూ శ్రమిస్తా
‘ఐసీసీ అవార్డు లభించినందుకు ఆనందంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవడం ముఖ్యం కాదు. కానీ గెలవాలన్న కోరిక మాత్రం ఎప్పుడూ ఉండాలి. విజయం సాధించే దిశగా ఇదో చిన్న అడుగు మాత్రమే. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా శ్రమిస్తా. వీలైనంత ఎక్కువ కాలం దేశానికి ఆడటానికి ప్రయత్నిస్తా’
- పుజారా (భారత బ్యాట్స్‌మన్)
తుది జట్టులో చోటు ఆశిస్తున్నా
‘ఉపఖండం వెలుపలా ఆడి భారత్‌ను గెలిపించాలన్నది నా పెద్ద లక్ష్యాల్లో ఒకటి. భారత్‌లో చాలా క్రికెట్ ఆడాను. కానీ దక్షిణాఫ్రికాలో ఆడటం ప్రత్యేకమైన అనుభూతి. ప్రస్తుతం దానిపైనే దృష్టిపెట్టా. తుది జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నా’
- ఓజా (భారత స్పిన్నర్)