మేము ఇంకా సెట్ కాలేదు:ధోని
ముంబై: వన్డే క్రికెట్ లో తమ జట్టు ఇంకా పూర్తి స్థాయిలో సెట్ కాలేదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘోర పరాజయన్ని మూటగట్టుకోవడంపై మాట్లాడిన ధోని.. అటు బ్యాటింగ్ తో పాటు, ఇటు బౌలింగ్ లోనూ జట్టు పూర్తిగా కుదురుకోలేకపోవడం వల్లే ఓటమి చెందామన్నాడు. 'జట్టులో అస్థిరత ఎక్కువగా కనబడుతుంది. భారత క్రికెటర్లలో ప్రతిభకు కొదవ లేకపోయినా, వారి నిలకడగా రాణించకపోవడమే వైఫల్యాలు కారణం. దీనిపై నిశితంగా దృష్టి పెట్టాల్సింది ఉంది' అని ధోని పేర్కొన్నాడు.
మ్యాచ్ డిసైడర్ గా పేరున్న ధోని మరోసారి విఫలం చెందడంపై ఏమి చెబుతారనే ప్రశ్నపై స్పందిస్తూ.. అసలు చివరి వన్డే మ్యాచ్ లో ఏం జరిగిందనేది దానిపై దయచేసి అడగకండి. స్కోరు బోర్డుపై దాదాపు 450 పరుగులు ఉన్నప్పుడు కూడా ధోని ఏం చేశాడు అని అడుతున్నారా (నవ్వుతూ) అంటు చమత్కరించాడు. దక్షిణాఫ్రికా చేసిన స్కోరును ఛేదించడం కష్టసాధ్యమని తెలిపాడు. దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 20 నుంచి 25 ఓవర్ల మధ్య కొంత మేర తమ అధీనంలోనే ఉందని.. తరువాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్ పై పట్టుజారిందని ధోని తెలియజేశాడు. సఫారీలు బ్యాటింగ్ అద్భుతమంటూ మిస్టర్ కూల్ ప్రశంసల వర్షం కురిపించాడు.