'ఆ స్థానంలో సరైన బ్యాట్స్ మన్ అవసరం'
ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైన అనంతరం ఐదు, ఆరు, ఏడు స్థానాల్లోని బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులపై దృష్టి సారించినట్లు స్పష్టం చేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిడిల్ ఆర్డర్ ను పటిష్ట పరచాల్సిన అవసరం ఉందన్నాడు. కొత్త బంతితో ఆరంభమైన ఇన్నింగ్స్ లో ప్రత్యర్థికి ఆదిలోనే రెండు వికెట్లు సమర్పించుకుంటే అది మిడిల్ ఆర్డర్ పై ప్రభావం చూపుతుందన్నాడు. ఆ క్రమంలోనే 40 నుంచి 50 ఓవర్లు మధ్య భారీ షాట్లు ఆడి పరుగులు చేయడం కష్ట సాధ్యంగా మారుతుందన్నాడు. దాన్ని అధిగమించాలంటే కచ్చితంగా ఏడో స్థానంలో సరైన ఆటగాడు ఉండాలని ధోని తెలిపాడు. మారిన నిబంధనల ప్రకారం స్లాగ్ ఓవర్లలో పరుగులు రాబట్టడంతో పాటు పరిస్థితులు తగ్గట్టు ఆడాలంటే ఏడో స్థానాన్నిబలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
'చివరి ఓవర్లలో ఆడటం అంత తేలిక కాదు. జట్టు వ్యూహంలో భాగం పంచుకుంటూ ఆఖరి 10 ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. ఆ ఓవర్లలో 80 నుంచి 90పరుగులు రాబడితేనే మ్యాచ్ పై పట్టు చిక్కుతుంది. అందుకు ఏడో స్థానం ఎంతో కీలకం. కొత్త నిబంధనలతో చివరి 10 ఓవర్లలో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు ఉంటారు. ఆ సమయంలో భారీ షాట్లు ఆడటం చాలా క్లిష్టం. అందుకు ఏడో స్థానంలో వచ్చే ఆటగాడు యోగ్యమైన బ్యాట్స్ మెన్ అయితేనే పరుగులు సాధించే అవకాశం ఉంది' అని ధోని పేర్కొన్నాడు.