దటీజ్ లీడర్!!
నాయకుడు అంటే ఎలా ఉండాలి? తనకు అవకాశం వచ్చినా కూడా.. వీలైతే దాన్ని పక్కవాళ్లకు అందించగలిగేలా ఉండాలి. తాను గెలవడంతో పాటు.. పక్కవాళ్లను కూడా గెలిపించడం, వాళ్లకు పేరు వచ్చేలా చేయడం ఇవన్నీ నాయకత్వ లక్షణాలు. వీటిని నూటికి నూరుశాతం చేసి చూపిస్తున్న లీడర్.. టీమిండియా కెప్టెన్, రాంచీ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ. శుక్రవారం నాటి సెమీఫైనల్స్ మ్యాచ్ చివర్లో చూసినవాళ్లు ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
సాధారణంగా ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్లోనైనా ధోనీ బ్యాటింగ్కు దిగాడంటే దాదాపుగా విన్నింగ్ షాట్ అతడే కొట్టేవాడు. చిట్టచివర్లో ఎన్ని పరుగులు చేయాలన్నా కూడా సిక్సర్ కొట్టి మ్యాచ్ సొంతం చేసుకోవడం ధోనీకి అలవాటు. కానీ శుక్రవారం నాడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. అప్పటివరకు చెలరేగి ఆడి, టీమిండియాను విజయ తీరానికి చేర్చిన సహచరుడు విరాట్ కోహ్లీకి ఆ అవకాశాన్ని చేతులారా అందించాడు. దాన్ని స్టేడియంలో ఉన్న వేలాది మందితో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది భారతీయులు కళ్లారా చూసి ఆస్వాదించారు.
జట్టు స్కోరు 167 పరుగుల వద్ద ఉండగా అప్పటికి ధాటిగా ఆడుతున్న సురేష్ రైనా ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో డుప్లెసిస్ క్యాచ్ పట్టడంతో రైనా వికెట్ పడింది. దాంతో కెప్టెన్ ధోనీ బ్యాటింగ్కు వచ్చాడు. అయితే, అప్పటికే మ్యాట్ క్రాస్ కావడంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎండ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా 172 పరుగులు చేసింది. టీమిండియా విజయలక్ష్యం 173.
అప్పటికి ఒక్కటే పరుగు కావాలి. లెఫ్టామ్ పేస్ బౌలర్ హెండ్రిక్స్ స్లో, షార్ట్ బాల్ వేసి 19వ ఓవర్ ముగించాడు. మామూలుగా అయితే అలాంటి బాల్ను ధోనీ సులభంగా సిక్సర్ బాదేసేవాడు. కానీ అతడిలో ఉన్న లీడర్ అలా చెయ్యనివ్వలేదు. నవ్వుతూ ఆ బాల్ను డిఫెన్స్ ఆడాడు. అంతకుముందు ధోనీ బ్యాటింగ్కు వచ్చినప్పుడు 'ఆప్ ఖతమ్ కరో' (మీరు పూర్తిచేసేయండి) అని కోహ్లీ చెప్పగా, 'తూనే అచ్ఛీ బ్యాటింగ్ కరీ హై, తో యే మేరా గిఫ్ట్ హై తేరే లియే' (నువ్వు మంచి బ్యాటింగ్ చేశావు. ఇది నీకు నా బహుమతి) అని ధోనీ బదులిచ్చాడు. దాంతో 20వ ఓవర్ బౌలింగ్ చేయడానికి డేల్ స్టెయిన్ రాగానే తొలి బంతినే కోహ్లీ బౌండరీకి పంపించాడు. అంతే.. భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎంత బాగా బ్యాటింగ్ చేసినా, విన్నింగ్ షాట్ కొట్టడమంటే ఎవరికైనా అదో థ్రిల్. సరిగ్గా ఆ థ్రిల్లింగ్ అనుభవాన్ని అప్పటివరకు బాగా ఆడిన సహచరుడికి అందించాలనుకున్నాడు ధోనీ. కోహ్లీ కూడా అందుకు చాలా సంతోషంగా ఫీలయ్యాడు. విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం ఇచ్చినందుకు కెప్టెన్కు కృతజ్ఞతలు తెలిపాడు.