ప్రతీకారానికి ‘ప్రాక్టీస్’
ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన మొదలు
నేటి నుంచి లెస్టర్‌తో మూడు రోజుల మ్యాచ్
లీసెస్టర్: సరిగ్గా మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. 0-4 తేడాతో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన ధోనిసేన... ఆ పర్యటనలో కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ మూడేళ్లలో పరిస్థితి మారింది. ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన పేలవంగా మారింది. కాబట్టి గత సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇదే లక్ష్యంతో ఇంగ్లండ్ చేరిన భారత్ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు... నేటి నుంచి తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
లెస్టర్‌షైర్‌తో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో దాదాపుగా ప్రధాన ఆటగాళ్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత పర్యటనలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉన్నా కూడా భారత్ చిత్తుగా ఓడింది. అప్పటి జట్టులో ఉన్న ధోని, గంభీర్, ఇషాంత్ శర్మలకు మాత్రమే ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది. కోహ్లి, పుజారాలాంటి యువ క్రికెటర్లందరికీ ఈ సిరీస్ పెద్ద పరీక్ష.