గాడిలో పడ్డారు
వాంగేరి: న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు ఎట్టకేలకు కాస్త గాడిలో పడ్డారు. ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలెవన్ జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగారు.
దీంతో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ ఎలెవన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 262 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యువ బౌలర్ ఈశ్వర్ పాండే (3/42) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో ఘోరంగా విఫలమైన ఇషాంత్ శర్మ (2/58), అశ్విన్ (2/45) రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టి ఫర్వాలేదనిపించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 41 పరుగులు చేసింది.
ధోని, కోహ్లి, జడేజాలకు విశ్రాంతి
రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌గా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు కెప్టెన్ ధోనితో సహా విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ బౌలర్లు షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతినిచ్చారు. టెస్టు స్పెషలిస్టులు మురళీ విజయ్, పుజారా, జహీర్ ఖాన్‌లతోపాటు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, అంబటి రాయుడు, ఈశ్వర్ పాండే వంటి వారికి అవకాశం లభించింది. కాగా, డెవ్‌కిక్ సారథ్యంలోని కివీస్ ఎలెవన్ జట్టుకు వర్కర్-ఒడోనెల్ జోడీ 81 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్నిచ్చింది.
అయితే లంచ్ అనంతరం వర్కర్ (33)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా అశ్విన్... భారత్‌కు తొలి బ్రేక్ ఇవ్వగా, ఆ వెంటనే డెవ్‌కిక్ (9)ను జహీర్ వెనక్కి పంపించాడు. ఈ దశలో హిక్కీ (85 బంతుల్లో 45; 7 ఫోర్లు) జతగా ఒడోనెల్ కివీస్ ఎలెవన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే రహానే క్యాచ్‌తో ఒడోనెల్ (124 బంతుల్లో 80; 13 ఫోర్లు)ను ఇషాంత్ ఔట్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి కివీస్ ఎలెవన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
యువ పేసర్ ఈశ్వర్ పాండే చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసురుతూ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 235 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన కివీస్ జూనియర్ జట్టు మరో ఆరు ఓవర్ల తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం మురళీ విజయ్ (19 బ్యాటింగ్), శిఖర్ ధావన్ (16 బ్యాటింగ్)లు కివీస్ బౌలర్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటూ క్రీజులో నిలిచారు.
స్కొరు వివరాలు
న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: వర్కర్ (ఎల్బీ) అశ్విన్ 33, ఒడోనెల్ (సి) రహానే (బి) ఇషాంత్ 80, డెవ్‌కిక్ (సి) సాహా (బి) జహీర్ 9, హిక్కీ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 45, హిక్స్ (సి) రాయుడు (బి) ఉమేశ్ 5, వాల్ష్ (సి) రోహిత్ (బి) పాండే 1, సీఫర్ట్ (సి) సాహా (బి) పాండే 8, బౌల్ట్ (సి) ధావన్ (బి) అశ్విన్ 8, బాడెన్‌హాస్ట్ (నాటౌట్) 34, టుగాగ (సి) జహీర్ (బి) పాండే 8, మెక్‌పీక్ (నాటౌట్) 16, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం: (78 ఓవర్లలో 9 వికెట్లకు) 262 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-81, 2-92, 3-149, 4-155, 5-160, 6-171, 7-196, 8-209, 9-235.
బౌలింగ్: జహీర్ 18-6-42-1, ఉమేశ్ 18-4-70-1, ఇషాంత్ 14-2-58-2, అశ్విన్ 14-2-45-2, ఈశ్వర్ పాండే 14-5-42-3.