సమరానికి ‘సన్నాహకం’
ఉ. గం. 9 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
అడిలైడ్: ఫిట్‌నెస్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్... ఎవరి సామర్థ్యం ఏంటో... ఎవరు అందుబాటులో ఉంటారో కూడా తెలిసిపోయింది. ఇక అసలు సమరానికి ముందు అస్త్రాలను పరీక్షించుకోవడం ఒక్కటే మిగిలింది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) ఆస్ట్రేలియాతో భారత్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అఫ్ఘానిస్తాన్‌తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్నా... అందులో ఎలాగూ ధోనిసేనదే పైచేయి అవుతుంది. కాబట్టి జట్టును పూర్తిస్థాయిలో పరీక్షిం చుకునేందుకు ఈ వార్మప్ మ్యాచే అత్యంత కీలకం కానుంది. దాదాపుగా ప్రపంచకప్‌లో ఆడే తుది జట్టుతోనే బరిలోకి దిగనున్నారు. గత రెండు నెలలుగా ఆసీస్ గడ్డపై ఒక్క విజయం కూడా సాధించలేకపోయినా... కెప్టెన్ ధోని మాత్రం పూర్తి ధీమాగా కనిపిస్తున్నాడు.
టెస్టు, ముక్కోణపు సిరీస్ ఫలితాలు తమపై ప్రభావం చూపవని చెబుతున్నాడు. ఫామ్ లేక ఇబ్బందులుపడుతున్న కోహ్లితో పాటు ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన రోహిత్, భువనేశ్వర్, జడేజాల ప్రదర్శన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు తొలగాలంటే రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి రావాలి. అదే సమయంలో ధోని వ్యూహాల్లో జడేజాది కీలక పాత్ర. అతను కూడా భుజం గాయం నుంచి కోలుకున్నాడు. వీళ్లందరూ ఏఏ స్థానాల్లో ఎలా ఆడతారనే దానిపైనే అందరూ దృష్టిపెట్టారు. ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లు ఆఖరి చాన్స్. ఇందులో విఫలమైతే రోహిత్‌తో పాటు రహానే ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో ఉమేశ్‌కు బదులుగా మోహిత్ శర్మకు అవకాశం దక్కొచ్చు.
మోకాలి గాయంతో ఇషాంత్ టోర్నీకి దూరం కావడం జట్టు అవకాశాలను క్లిష్టతరం చేసింది. ఆసీస్ వాతావరణ పరిస్థితుల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగకరంగా ఉండేది. స్పిన్‌లో అశ్విన్ వైపు మొగ్గుతారా? అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా? అనేది ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా లేకపోవడంతో జట్టు మొత్తాన్ని పరీక్షించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది.