
నేడు బీసీసీఐ వైద్య బృందం నివేదిక
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.
ప్రస్తుతానికి భారత పేసర్ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దిగలేదు.
నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్ రోవన్ షూటెన్‌కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేదా పేసర్ హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
మార్చి 1న బీసీసీఐ ఎస్‌జీఎం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్ దాల్మియా (బెంగాల్ సంఘం), రోహన్ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్ నాయక్ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది.
అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్‌జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment