లక్నో/కోల్‌కతా : బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తమ మత విశ్వాసాలను కించపరిచేలా తస్లీమా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ మత గురువు హసన్ రజా ఖాన్ నూరి మియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 6వ తేదీన తస్లీమా ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మత గురువులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని హసన్ రజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తస్లీమా పాస్‌పోర్టును వెంటనే స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా తనపై ఎఫ్‌ఐఆర్ నమోదయినట్టు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తస్లీమా అన్నారు. తాను వాస్తవాలనే చెప్పానని ఆమె పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిటో అర్థం కావడం లేదని, సత్యం మాట్లాడినందుకు మరోసారి తనకు ఇబ్బందులు తప్పడం లేదని ఢిల్లీలో మీడియాతో అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామిక భారత దేశంలో ఇలాంటిది జరుగుతుందని అనుకోలేదని అన్నారు. గతంలో ఛాందసవాదులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను అధికారులు కోల్‌కతానుంచి ఢిల్లీకి పంపించిన విషయం తెలిసిందే.