రచయితలపై తస్లీమా ఫైర్
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని నిరసన వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితల సంఖ్య 30కి చేరింది. ఒకవైపు రచయితలు వరుసపెట్టి తమ పురస్కారాలను వాపస్ ఇస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం వారి నిరసన కల్పితమైనదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై తాజాగా భారత్లో ప్రవాసముంటున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారతీయ రచయితలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై దాడి జరిగినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు.
అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా అన్యాయాలపై నిరసన తెలియజేయడం తప్పేమీ కాదన్నారు. ఇది కల్పిత నిరసన అని ప్రభుత్వం చేస్తున్న వాదనతో తాను ఏకీభవించడం లేదని, రచయితలు రాజకీయంగా, సామాజికంగా స్పృహ కలిగిన వ్యక్తులని పేర్కొన్నారు. 'నా పుస్తకం పశ్చిమ బెంగాల్లో నిషేధించినప్పుడు, నాపై భారత్లో ఐదు ఫత్వాలు జారీచేసినప్పుడు, బెంగాల్ నుంచి నన్ను వెళ్లగొట్టినప్పుడు, ఢిల్లీలో నెలపాటు నన్ను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు చాలామంది రచయితలు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ జీవించడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఈ విషయంలో రచయితలు మౌనంగా ఉండటమే కాకుండా.. సునీల్ గంగూలీ, శంఖా ఘోష్ వంటి రచయితలు నా పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టచార్యకు కోరారు కూడా' అని తస్లీమా పేర్కొన్నారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారత రచయితలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు.
ఇక్కడ లౌకికవాదమూ సమస్యే!
భారత్లో లౌకికవాదం అనుసరించే విధానంలోనూ సమస్య ఉందని, చాలామంది లౌకికవాదులు ముస్లింలకు అనుకూలంగా, హిందూ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని తస్లీమా పేర్కొన్నారు. వారు హిందూ ఛాందసవాదుల చర్యలను నిరసిస్తారు.. అదేసమయంలో ముస్లిం ఛాందసవాదుల దారుణమైన చర్యలను సమర్థిస్తారని తెలిపారు.