నోబెల్‌ వేడుక: ధోతి ధరించి.. భారతీయత ఉట్టిపడేలా! | Sakshi
Sakshi News home page

ధోతీలో నోబెల్‌ అందుకున్న ప్రవాస భారతీయ ఆర్థికవేత్త

Published Wed, Dec 11 2019 3:15 PM

Abhijit Banerjee Receives Nobel Prize In Dhoti - Sakshi

స్టాక్‌హోమ్‌: ఇండో-అమెరికన్‌ ఆర్థికవేత్త అభిజిత్‌ వినాయక్‌ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్‌ డఫ్లోతోపాటు సహోద్యోగి మైఖేల్‌ క్రెమెర్ 2019 ఏడాదికిగాను ఆర్థిక శాస్త్ర నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. అట్టహాసంగా జరిగిన నోబెల్‌ పురస్కార ప్రదానోత్సవానికి అభిజిత్‌ దంపతులు భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానంలో విస్తృతమైన పరిశోధన చేసినందుకుగాను వారికి నోబెల్‌ అవార్డు వరించింది. వారి పరిశోధన ఆర్థిక శాస్త్ర రంగాన్ని పునర్నిర్వచించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
 

పేదరిక నిర్మూలనకు ఈ త్రయం చేసిన కృషికిగాను మంగళవారం స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఆ దేశ రాజు కార్ల్‌- 16 గుస్తాఫ్‌ నుంచి అవార్డు అందుకొన్నారు. ఈ వేడుకలో భారత సంతతికి చెందిన అభిజిత్‌ బెనర్జీ ధోతితోపాటు బ్లాక్‌ కలర్‌ బంద్‌గాల కోటు ధరించి భారతీయ సంప్రదాయ వేషాధారణలో అందరినీ ఆకర్షించారు. ఆయన భార్య ఎస్తేర్‌ డఫ్లో సైతం నీలి రంగు చీర ధరించి నోబెల్‌ను అందుకున్నారు. 

ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్‌ అందుకున్న ఈ ముగ్గురు ఆర్థికవేత్తలకు పతకాలతో పాటు రూ. 6.7 కోట్లను (9 మిలియన్ల స్వీడిష్ క్రోనాలు) బహుమతిగా పొందారు. ముంబైలో జన్మించిన బెనర్జీ.. అమర్త్యసేన్ తరువాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన రెండవ ఆర్థికవేత్తగా చరిత్రలోకి ఎక్కారు. నోబెల్‌ బహుమతి అందుకున్న అమర్త్య సేన్, అభిజిత్ బెనర్జీ .. కోల్‌కతా ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యను అభ్యసించడం గమనార్హం. 

అభిజిత్ బెనర్జీ, భార్య ఎస్తేర్ డఫ్లోలు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఐటీ)  ఎకనామిక్స్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తుండగా.. క్రెమెర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. భారతదేశంలో గ్రామీణ సమస్యలను పరిష్కరించడానికి కనీస హామీ పథకంతో పాటు పలు సలహాలు సూచించారు. 

చదవండి: అభిజిత్‌ ‘నోబెల్‌’ వెలుగు నీడలు

Advertisement
 
Advertisement
 
Advertisement