నోబుల్ ప్రైజ్ అంటే చంద్రబాబుకు తెలుసా?
హైదరాబాద్ : ప్రయివేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ-చైతన్య విద్యాసంస్థల్లో ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయంపై ఆలోచించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. చంద్రబాబుకు మంత్రి నారాయణ బినామీ అని.... ఆయన బినామీ నారాయణ విద్యాసంస్థలని ఆయన విమర్శించారు. అందుకే ఈ అంశంపై ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
అలాగే నోబుల్ ప్రైజ్ సాధిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ప్రకటనను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అసలు నోబుల్ ఫ్రైజ్ అంటే చంద్రబాబుకు తెలుసా అని సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ, ఉపాధ్యాయులను తీసివేయాలని సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు. నిన్న మొన్నటి వరకూ సింగపూర్, కజికిస్తాన్ అన్న చంద్రబాబు తాజాగా శ్రీలంక పాట పాడుతున్నరని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.