ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్ | Nobel physics prize awarded to British born scientists | Sakshi
Sakshi News home page

ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్

Published Wed, Oct 5 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్

ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్

స్టాక్‌హోమ్: పదార్థానికి ఉండే అసాధారణ స్థితిగతులపై పరిశోధన చేసిన ముగ్గురు బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టార్లిట్జ్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ దక్కింది. గణిత శాస్త్ర ప్రత్యేక విభాగమైన టోపాలజీలో పరిశోధన చేసి, మన చుట్టూ ఉండే పదార్థం మనకు తెలియని అసాధారణ స్థితిగతులను కలిగి ఉంటుందన్న రహస్యాన్ని వీరు ఛేదించారని నోబెల్ జ్యూరీ రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ‘భవి ష్యత్తులో అతి చిన్న, వేగవంతమైన క్వాం టమ్ కంప్యూటర్ల తయారీకి, అత్యుత్తమ ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలకు, సూపర్ కండక్టర్ల అభివృద్ధికి వీరి పరిశోధన మార్గం సుగమం చేసింది.

ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే (ఓవర్ హీటింగ్) సమస్య లేకుండా విద్యుత్‌ను, సమాచారాన్ని ప్రసారం చేసేందుకు వీలవుతుంది’ అని తెలిపింది. ఈ ముగ్గురు ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నారు. థౌలెస్ వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో, హాల్డెన్, కోస్టార్లిట్జ్ బ్రౌన్ వర్సిటీలో ప్రొఫెసర్లు. అవార్డు కింద రూ.6.18 కోట్లు (8 మిలియన్ల స్వీడన్ క్రోనార్లు) బహుమతిగా అందజేయనుండగా... డేవిడ్ థౌలెస్‌కు 50 శాతం, హాల్డేన్, కోస్టర్లిట్జ్‌లు 25 శాతం చొప్పున అందుకోనున్నారు.  
 
పదార్థ అసాధారణ స్థితిపై పరిశోధనకు బహుమతి
ఏమిటీ టోపాలజీ..
గణిత శాస్త్రంలో టోపాలజీ ఓ ప్రత్యేకవిభాగం. అంతరిక్షం, పదార్థాల భౌతిక ధర్మాలు, బహిర్గత ఒత్తిడికి గురై ఆకారంలో మార్పులు జరిగినా పూర్వ స్థితికి చేరుకునే లక్షణం వంటి అంశాలపై అధ్యయనమే టోపాలజీ. అయితే ఈ ఒత్తిడికి గురి చేసే శక్తి వినియోగం వంచడం, మెలితిప్పడం వంటి రెండు అంశాలకే పరిమితం. ఈ తరహా ఒత్తిడికి గురి చేసిప్పుడు, (లేదా శక్తిని ప్రయోగించినప్పు డు) ఆ పదార్థం స్థితిగతుల్లో వచ్చే అసాధారణ మార్పులను వారు సిద్ధాంతపరంగా నిరూపించారు.

ఉదాహరణకు  రబ్బరు గ్లాసును వంచడం, మెలితిప్పడం, డోనట్ ఆకృతిలోకి(గుండ్రంగా ఉండి మధ్యలో రంధ్రం ఉండేలా) మార్చడం వంటివి. టోపాలజీ దృష్టిలో తొలుత ఉన్న రబ్బరు గ్లాసు ఆకృతికి, మార్చిన ఆకృతికి మధ్య భేదం ఉండదు. అందులోని పదార్థ అసాధారణ స్థితిగతులు, మార్పుల దశలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది.
 
సూపర్ కండక్టర్ల అభివృద్ధికి తోడు
ఇలా మనం సాధారణంగా వినియోగించే పదార్థ టోపాలాజికల్ స్థితులలో మార్పులు చేయడం ద్వారా.. అవి అతిగా వేడెక్కే (ఓవర్ హీటింగ్) సమస్య లేకుండా తక్కువ దూరాలలో శక్తి (విద్యుత్)ని, సమాచారాన్ని రవాణా చేయడానికి వీలు కలుగుతుంది. అంటే అత్యంత సమర్థవంతమైన సూపర్ కండక్టర్లను, సూపర్ ఫ్లూయిడ్‌లను రూపొందించొచ్చు.  అయితే ఇలా టోపాలాజికల్ మార్పులు రంధ్రాలు చేయడం, చింపడం, అతికించడం వంటి వాటికి వర్తించదు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనలు మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ముఖ్యంగా సూపర్ స్మాల్ క్వాంటమ్ స్కేల్ రూపకల్పనకు తోడ్పడనున్నాయి. ఈ అంశంపై  థౌలెస్,  హాల్డేన్, కోస్టార్లిట్జ్‌లు 1970, 80 దశకాల్లోనే పరిశోధన చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement