వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా, ఆరోపణలు ఎన్నివచ్చినా ఏటా ప్రకటించే నోబెల్ పురస్కారాలపై ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆసక్తి ఉంటుంది. భిన్న రంగాల్లో నోబెల్ కమిటీ ఎవరిని ఎంచుకుంటుందన్న అంశంపై చర్చలు సాగుతాయి. ఎంపికైనవారు ఆయా రంగాల్లో చేసిన కృషిపై విశ్లేషణలుంటాయి. మిగిలిన పురస్కారాల మాటెలా ఉన్నా నోబెల్ శాంతి బహుమతి విషయంలో తరచుగా వివాదాలు రేకెత్తుతుంటాయి. ఈసారి పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో తాలిబన్ల చేతుల్లో తీవ్రంగా గాయపడి మృత్యువు చేరువదాకా వెళ్లిన మలాల యూసఫ్‌జాయ్‌కి శాంతి బహుమతి వస్తుందని అందరూ అంచనావేశారు. ఇంకా సంక్షుభిత సిరియా విషయంలో అమెరికాకు నచ్చజెప్పి, యుద్ధ మేఘాలను నివారించిన రష్యా అధ్యక్షుడు పుతిన్... ఘర్షణలతో అట్టుడికే ఆఫ్రికా దేశం కాంగోలో శాంతి కోసం తీవ్రంగా పోరాడిన వైద్యుడు డెనిస్ ముక్వెజ్... గ్వాటెమాలాలో శక్తిమంతమైన మాఫియా నేతలతో న్యాయస్థానాల్లో పోరాడిన ఆ దేశ అటార్నీ జనరల్ క్లాడియా పాజ్ వంటి మరో 259మంది పేర్లు నోబెల్ శాంతి పురస్కారం పరిశీలనకు వచ్చాయి. కొందరైతే అమెరికా యుద్ధ నేరాలను ప్రపంచానికి వెల్లడించిన ఆ దేశ సైనికుడు బ్రాడ్లీ మానింగ్ పేరును ప్రతిపాదించారు. అయితే, అంచనాలన్నిటినీ తలకిందులుచేస్తూ ఈసారి నోబెల్ కమిటీ... రసాయన ఆయుధాల నిర్మూలనకు హేగ్ కేంద్రంగా కృషి చేస్తున్న రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (ఓపీసీడబ్ల్యు)ను ప్రపంచ శాంతి బహుమతికి ఎంపికచేసింది. ఈ సంస్థ సిరియాలో రసాయన ఆయుధ నిల్వల నిర్మూలనకు సంబంధించిన పనుల్లో ఇప్పుడు చురుగ్గా పాల్గొంటున్నది.
పదహారేళ్ల మలాలకు నోబెల్ వస్తుందని నమ్మినవారున్నా ఆమెకు ఎందుకు రావాలని ప్రశ్నించినవారూ లేకపోలేదు. ఆడపిల్లలు చదువుకోరాదన్న ఉగ్రవాదుల హుకుంను ఆమె ధిక్కరించడం, వారి ధోరణులను వ్యతిరేకిస్తూ మీడియాకు లేఖలు రాయడం, చివరకు వారి దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి కోలుకున్నా తన సంకల్పాన్ని విడనాడకపోవడం...ఇవన్నీ సాహసోపేతమైనవే. తుపాకుల భాష తప్ప మరేమీ రాని వారితో మాట్లాడటానికి, వారిని ప్రశ్నించడానికి ప్రయత్నించడం సాధారణ విషయం కాదు. అదే సమయంలో ఆమె ఉగ్రవాదుల గురించి మాట్లాడినంతగా ఆ ప్రాంతంలో నిత్యమూ ద్రోన్ దాడులతో అమాయకులను హతమారుస్తున్న పశ్చిమ దేశాల దుడుకుదనాన్ని నిలదీయలేద న్న విమర్శలున్నాయి. మలాల వయసురీత్యా చూస్తే ఆమెపై ఇంత పెద్ద బాధ్యతను పెట్టడం కూడా సరికాదు. తననూ, తనలాంటి బాలికలనూ చదువుకు దూరంచేయడాన్ని ప్రశ్నించే చైతన్యం ఉండటమే గొప్ప విషయం. ఆ చైతన్యం వేలాది మంది బాలికలకు స్ఫూర్తినిస్తుంది. మలాల సంగతి అటుంచి, ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నోబెల్ శాంతి బహుమతి వరిస్తుందని అంచనా వేసినవారున్నారు. అంతర్యుద్ధంలో చిక్కి శిథిలమైన సిరియాపై దురాక్రమణకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలూ ప్రయత్నిస్తుండగా పుతిన్ చివరి నిమిషంలో అడ్డుపడ్డారు. ఆయన కృషి కారణంగానే రసాయన ఆయుధ నిల్వలను రష్యాకు అప్పగించడానికి గత నెలలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అంగీకరించారు. ఆగస్టులో సిరియా రాజధాని డమాస్కస్‌లో రసాయన ఆయుధ ప్రయోగం కారణంగా వందలమంది మరణించాక అమెరికా సిరియాపై కాలు దువ్వింది. అంతటి సంక్షోభాన్ని నివారించ గలిగిన పుతిన్‌కు శాంతి బహుమతి వస్తుందని అనుకోవడంలో వింతేమీ లేదు.
2009లో అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించేసరికి శాంతికోసం ఆయన చేసిన ప్రత్యేక కృషి ఏమీ లేదు. అణ్వస్త్రాలను సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో ముఖాముఖి మాట్లాడటానికి తాను సిద్ధమని మాత్రమే అప్పటికాయన ప్రకటించివున్నారు. ఆ పనిని ఆయన ఇంకా ప్రారంభించలేదు. నిజానికి అలా ప్రయత్నించేంత సమయం ఆయనకు లభించలేదు. అప్పటికి ఆయన అమెరికా అధ్యక్ష పీఠం అధిష్టించి తొమ్మిది నెలలే అయింది. అయినా సరే...ఒబామాకు ఆ బహుమతిని కట్టబెట్టడానికి నోబెల్ కమిటీ ఎక్కడలేని ఉత్సాహాన్నీ ప్రదర్శించింది. అలా చూస్తే ఇప్పుడు కయ్యానికి కాలుదువ్విన ఒబామాను వారించడంలో విజయం సాధించిన పుతిన్ ఆ బహుమతికి అన్నివిధాలా అర్హుడు. నిరుడు నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన యూరొపియన్ యూనియన్‌ది మరో కథ. ఆ సంస్థ యూరోప్‌లో శాంతికి, ప్రజాస్వామ్యానికి, మానవహక్కులకు ఎనలేని కృషి జరిపిందని నోబెల్ కమిటీ తెగ పొగిడింది. కానీ, అంతకు పదేళ్లక్రితం అమెరికాతో కలిసి యూరోప్ దేశాలు ఇరాక్‌పై దాడిచేసి వల్లకాడుగా మార్చడాన్ని మర్చిపోయింది. కనీసం ఏడాదిన్నరక్రితం ఆ కూటమి లిబియాపై సాగించిన దుండగమైనా గుర్తుకురాలేదు. ఎక్కడేమి చేసినా యూరోప్‌ను ప్రశాంతంగా ఉంచితే చాలన్నమాట!
ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి లభించిన ఓపీసీడబ్ల్యు సంస్థ రసాయన ఆయుధాల నిర్మూలన కోసం పదహారేళ్లనుంచి కృషిచేస్తోంది. అందుకోసమని 86 దేశాల్లో 5,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. దాదాపు 55,000 టన్నుల రసాయన ఆయుధాలను నిర్మూలించడంలో కీలకపాత్ర పోషించింది. కానీ, అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యాల వద్దనున్న రసాయన ఆయుధ నిల్వలను పూర్తిగా నిర్మూలించేలా చేయడంలో సఫలం కాలేకపోయింది. ఈ రెండు దేశాలూ తుది గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికీ అమెరికా వద్ద సుమారు 3,000 టన్నుల రసాయన ఆయుధాలున్నాయని అంచనా. ఇది సిరియా వద్ద ఉన్నాయని భావిస్తున్న నిల్వలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. నోబెల్ శాంతికి అనర్హులైనవారు ఈ సంస్థతో పోలిస్తే ఎందులో తీసికట్టో నోబెల్ కమిటీయే చెప్పాలి. మొత్తానికి వివాదాలకూ, అపోహలకూ అతీతంగా వ్యవహరించడం తనకింకా చేతకాలేదని కమిటీ ఈసారి కూడా నిరూపించుకుంది.
అ‘శాంతి’ నోబెల్!
Published Sat, Oct 12 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement