ఓస్లో : ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి డెనిస్ ముక్వేజ్, నదియా మురాద్‌లు ఎంపికయ్యారు. లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన కృషికి, లైంగిక దాడి బాధితులకు చేసిన సహాయానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న సెక్సువల్ వాయిలెన్స్‌కు వ్యతిరేకంగా ఈ ఇద్దరూ పోరాటం చేశారు.
డెనిస్ ముక్వేజ్ ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన గైనకాలజిస్ట్. ఆయన లైంగిక వేధింపుల బాధితులకు అండగా ఉంటూ వారికి వైద్యసహాయం అందించారు. ఇరాన్‌లోని యాజిది (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియా మానవ హక్కుల కోసం పోరాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కారణంగా తనపై జరిగిన లైంగిక హింసను, ఇతర యాజిది యువతులు అనుభవిస్తున్న నరకం గురించి ప్రపంచానికి తెలియజేశారు. యాజిది యువతులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు పాటుపడ్డారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్ని నిర్మూలించేందుకు డెనిస్, నదియా మురాద్‌లు చేసిన కృషిని నోబెల్ కమిటీ ప్రశంసిస్తూ పురస్కారాన్ని ప్రకటించారు.
గతేడాది నోబెల్ శాంతి బహుమతి 2017కు అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ సంస్థ (ఐసీఏఎన్) ఎంపికయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల నిర్మూలనకు ఈ సంస్థ చేస్తున్న కృషిని నోబెల్ కమిటీ ప్రశంసిస్తూ పురస్కారాన్ని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment