‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’ | Nadia Murad Once ISIS Slave Now Nobel Laureate | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 6:11 PM | Last Updated on Thu, Jul 18 2019 3:00 PM

Nadia Murad Once ISIS Slave Now Nobel Laureate - Sakshi

ఒకప్పుడు ఐసిస్‌ బానిసగా మృగాళ్ల కబంధ హస్తాల్లో చిత్రవధ అనుభవించింది... కుటుంబాన్ని కోల్పోయింది.. మూడు నెలల పాటు తనపై కొనసాగిన అత్యాచారాలను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది..  కానీ నాడు అలా చేసి ఉంటే ఆమె పేరు ప్రపంచానికి తెలిసేదే కాదు.. ఆమె లాంటి ఎందరో లైంగిక బానిసలకు విముక్తి లభించేదీ కాదు.. కష్టాల కడలిని దాటి లైంగిక బానిస నుంచి నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీతగా గుర్తింపు పొం‍దిన నదియా మురాద్‌ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం.

లైంగిక హింసకు వ్యతిరేకంగా..
సాక్షి వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం : లైంగిక హింసను అరికట్టేందుకు కృషి చేసినందుకు, అత్యాచార బాధితులకు అండగా నిలిచినందుకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్‌ ఎంపికయ్యారు. ఆఫ్రికాకు చెందిన గైనకాలజిస్ట్‌ డెనిస్‌ ముక్వేజ్‌తో సంయుక్తంగా ఓస్లోలో డిసెంబరు 10న ఆమె శాంతి పురస్కారం అందుకోనున్నారు. అధికార దాహంతో వివిధ దేశాల్లో అంతర్యుద్ధానికి తెగబడుతున్న ఐసిస్‌ వంటి ఉగ్రమూకల రాక్షసక్రీడ(లైంగిక హింస)కు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగానే వీరిద్దరిని అవార్డు వరించింది. డెనిస్‌ బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. ఇరాక్‌కు చెందిన యాజాదీ యువతిగా తాను ఎదుర్కొన్న పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసి తన లాంటి ఎంతో మందిని ఆ నరకం నుంచి విముక్తులను చేసేందుకు తన వంతు కృషి చేశారు... చేస్తూనే ఉన్నారు.

ఆ మూడు నెలలు నరకం..
‘ నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో లో నన్ను కిడ్నాప్‌ చేశారు. ఆ సమయంలో అడ్డొచ్చినందుకు మా అమ్మతో పాటు నా ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు, నా మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మెసూల్‌ పట్టణానికి తీసుకువెళ్లి ఇస్లాం మతంలోకి మార్చారు. మాలాంటి ఓ ముప్పై మంది బాధితులు ఉన్న శిబిరంలో మమ్మల్ని పడేశారు. రోజూ సుమారు అక్కడికి ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపై కూడా వాళ్లు కనికరం చూపలేదు.

ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్‌ నాయకుడొకడు నన్ను తీవ్రంగా కొట్టాడు. చిత్రవధ చేశాడు. ఇలా హింసించే బదులు మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు సరికదా ఇలా హింసించడంలోనే ఆనందం ఉందంటూ వెకిలిగా నవ్వాడు. ఇదంతా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా లాంటి ఎంతో మంది యువతుల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి కదా. ఇంత పిరికిగా ఆలోచిస్తే లాభం లేదనుకుని తప్పించుకునే మార్గం కోసం అన్వేషించాను. ఆ సమయంలో మెసూల్‌లోని ఓ ముస్లిం కుటుంబం నాకు సహాయం చేసింది. అలా మూడు నెలల తర్వాత ఆ నరక కూపం నుంచి ఎలాగోలా బయటపడి శరణార్థుల శిబిరానికి చేరుకున్నాను. అయినా సిరియా- ఇరాక్‌ వంటి దేశాల్లో అంతర్యుద్ధం కొనసాగుత్నుంత కాలం యాజాదీల పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుందా అని నాకు నేనే సమాధానం చెప్పుకొన్నాను’ అంటూ యాజాదీగా పుట్టినం‍దుకు ఐసిస్‌ ఉగ్రమూకల అకృత్యాలకు బలౌతున్న కుర్దిషియన్‌ వర్గానికి చెందిన యాజాదీ యువతుల దీన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు నదియా.

ఆమె పరిచయంతో.. పోరాటం ఉధృతం
శరణార్థుల శిబిరానికి చేరిన తర్వాత నదియా తమ బాధలను బాహ్య ప్రపంచానికి చెప్పే అవకాశం లభించింది. బ్రిటీష్‌ లాయర్‌, హక్కుల కార్యకర్త అమల్‌ క్లూనీ పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అమల్‌ ఇచ్చిన ప్రోత్సాహమే... తమకు జరుగుతున్న అన్యాయాన్ని నదియా ప్రపంచానికి చాటిచెప్పేలా చేసింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. అలా చేయడం ద్వారా సుమారు నాలుగున్నర లక్షల మంది బాధితులకు విముక్తి లభించింది.

‘ద లాస్ట్‌ గర్ల్’ ‌..బై నదియా మురాద్‌
తాను, తన వంటి యాజాదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ద లాస్ట్‌ గర్ల్‌ పేరిట నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి అమల్‌ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. అదే ఏడాది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇరాక్‌లో ఐసిస్‌ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో నదియా పోరాటానికి ఫలితం దక్కినట్లైంది.

కన్నీళ్లే కాదు.. ఆనంద భాష్పాలు ఉంటాయని చెప్పిన ప్రియనేస్తం
చిన్న వయస్సులోనే లైంగిక బానిసగా మారిన నదియా బహుశా తన జీవితంలో పెళ్లి అనే వేడుక ఉంటుందని అస్సలు ఊహించలేదేమో. ఎందుకంటే అప్పటి వరకు మృగాళ్లనే చూసిన నదియాకు అబిద్‌ షముదీన్‌ పరిచయం కాలేదు. అతడు కూడా యాజాదీ హక్కుల కార్యకర్త. ఎంతోమంది బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తి. నదియా వ్యక్తిత్వానికి  ముగ్ధుడైన అబిద్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆమెతో పంచుకున్నాడు. అబిద్‌పై ఉన్న అభిమానం ఆమె చేత సరేనని చెప్పించింది. ఈ క్రమంలోనే ఆగస్టులో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట త్వరలోనే వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు.

‘మా యాజాదీలు అనుభవిస్తున్న కష్టాలే మమ్మల్ని దగ్గర చేశాయి. వారికోసం ఇప్పటి నుంచి ఒక్కటిగా కలిసి పోరాడతాం అంటూ తనకు కాబోయే భర్త గురించి తన సోషల్‌ మీడియా పేజీలో రాసుకొచ్చారు 25 ఏళ్ల నదియా మురాద్‌. జీవితంలో కన్నీళ్లే కాదు ఆనంద భాష్పాలు కూడా ఉంటాయని చాటి చెప్పిన తన ప్రియనేస్తం అబిద్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement