వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. పాలనా విధానాలతోనే కాదు తన వింత చేష్టలు, ప్రశ్నలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్‌ను అవమానపరిచే రీతిలో ట్రంప్ మాట్లాడారు. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రమూకల చేతుల్లో లైంగిక హింసకు గురవుతున్న ఎంతో మంది యాజాది యువతులకు నదియా విముక్తి కల్పించారు. ఒకప్పుడు లైంగిక బానిసగా ఉన్న ఆమె చేసిన ఈ కృషికి గానూ గతేడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. కాగా బుధవారం ఆమె శ్వేతసౌధంలో ట్రంప్‌ను కలిశారు. ఇరాక్‌లోని యాజాదీలు అనుభవిస్తున్న నరకం, వారి దీనస్థితి గురించి ఆయనకు వివరించారు. ఐసిస్, కుర్దిష్ వర్గాల చేతుల్లో బలైపోతున్న యాజాదీలకు విముక్తి కల్పించాల్సిందిగా విఙ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో నదియా మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఆమె మాటలకు అడ్డు తగిలారు. ‘నీకు నోబెల్ బహుమతి వచ్చిందా? గొప్ప విషయం. అవును అసలు వాళ్లు నీకెందుకు అవార్డు ఇచ్చారు’ అంటూ నదియాను ప్రశ్నించారు. ఊహించని పరిణామానికి కంగుతిన్న నదియా వెంటనే తేరుకుని...ఐసిస్ లైంగిక బానిసలకు విముక్తి కలిగించినందుకు గానూ ఆఫ్రికా గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్‌తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిగా ఉన్న తాను నాయకురాలిగా ఎదిగన తీరును ట్రంప్‌నకు వివరించారు. ‘ మా అమ్మ, సోదరులను ఉగ్రవాదులు చంపేశారు. నన్ను బానిసను చేసి చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ నా పోరాటం ఆపలేదు. యాజాది మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసిస్ వాళ్ల లైంగిక దాడులకు అదుపులేకుండా పోయింది. దయచేసి మీరు కలుగుజేసుకుని అందరికీ న్యాయం చేయాలి. ఇరాక్, కుర్దిష్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి’ అని నదియా విఙ్ఞప్తి చేశారు.
చదవండి : ‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’
ఇందుకు బదులుగా ట్రంప్ మాట్లాడుతూ... ‘ఐసిస్‌ను నామ రూపాల్లేకుండా చేశాం కదా. ఇక మీరంటున్నది కుర్దిష్ వర్గాల గురించి. వాళ్లెవరో నాకు పూర్తిగా తెలియదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో నిరాశగా ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. కాగా సిరియా, ఇరాక్‌లో నరమేధం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలను పూర్తిగా ఏరివేసిన క్రమంలో అమెరికా సైన్యాలను వెనక్కి పిలుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సిరియాలోని కుర్దిష్ వర్గాలు ఉగ్రవాదులతో పాటు శరణార్థులను క్యాంపులకు తరలిస్తూ వారిని తిరిగి స్వదేశాలకు పంపాలని యోచిస్తున్నాయి. కానీ యూకే, అమెరికా వంటి దేశాలు ఇందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇరాక్, సిరియాలో అంతర్యుద్ధానికి ఆజ్యం పోసింది అగ్రదేశమే అంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment