Nadia Murad
-
నీకు నోబెల్ వచ్చిందా? గొప్ప విషయమే!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. పాలనా విధానాలతోనే కాదు తన వింత చేష్టలు, ప్రశ్నలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్‌ను అవమానపరిచే రీతిలో ట్రంప్ మాట్లాడారు. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రమూకల చేతుల్లో లైంగిక హింసకు గురవుతున్న ఎంతో మంది యాజాది యువతులకు నదియా విముక్తి కల్పించారు. ఒకప్పుడు లైంగిక బానిసగా ఉన్న ఆమె చేసిన ఈ కృషికి గానూ గతేడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. కాగా బుధవారం ఆమె శ్వేతసౌధంలో ట్రంప్‌ను కలిశారు. ఇరాక్‌లోని యాజాదీలు అనుభవిస్తున్న నరకం, వారి దీనస్థితి గురించి ఆయనకు వివరించారు. ఐసిస్, కుర్దిష్ వర్గాల చేతుల్లో బలైపోతున్న యాజాదీలకు విముక్తి కల్పించాల్సిందిగా విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నదియా మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఆమె మాటలకు అడ్డు తగిలారు. ‘నీకు నోబెల్ బహుమతి వచ్చిందా? గొప్ప విషయం. అవును అసలు వాళ్లు నీకెందుకు అవార్డు ఇచ్చారు’ అంటూ నదియాను ప్రశ్నించారు. ఊహించని పరిణామానికి కంగుతిన్న నదియా వెంటనే తేరుకుని...ఐసిస్ లైంగిక బానిసలకు విముక్తి కలిగించినందుకు గానూ ఆఫ్రికా గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్‌తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిగా ఉన్న తాను నాయకురాలిగా ఎదిగన తీరును ట్రంప్‌నకు వివరించారు. ‘ మా అమ్మ, సోదరులను ఉగ్రవాదులు చంపేశారు. నన్ను బానిసను చేసి చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ నా పోరాటం ఆపలేదు. యాజాది మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసిస్ వాళ్ల లైంగిక దాడులకు అదుపులేకుండా పోయింది. దయచేసి మీరు కలుగుజేసుకుని అందరికీ న్యాయం చేయాలి. ఇరాక్, కుర్దిష్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి’ అని నదియా విఙ్ఞప్తి చేశారు. చదవండి : ‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’ ఇందుకు బదులుగా ట్రంప్ మాట్లాడుతూ... ‘ఐసిస్‌ను నామ రూపాల్లేకుండా చేశాం కదా. ఇక మీరంటున్నది కుర్దిష్ వర్గాల గురించి. వాళ్లెవరో నాకు పూర్తిగా తెలియదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో నిరాశగా ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. కాగా సిరియా, ఇరాక్‌లో నరమేధం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలను పూర్తిగా ఏరివేసిన క్రమంలో అమెరికా సైన్యాలను వెనక్కి పిలుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సిరియాలోని కుర్దిష్ వర్గాలు ఉగ్రవాదులతో పాటు శరణార్థులను క్యాంపులకు తరలిస్తూ వారిని తిరిగి స్వదేశాలకు పంపాలని యోచిస్తున్నాయి. కానీ యూకే, అమెరికా వంటి దేశాలు ఇందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇరాక్, సిరియాలో అంతర్యుద్ధానికి ఆజ్యం పోసింది అగ్రదేశమే అంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
శాంతి యోధులు
-
లైంగికహింసపై పోరాటానికి నోబెల్
ఓస్లో: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ మక్వీజ్(63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్(25)లు ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరు ఎంతో పోరాడారని నోబెల్ ఎంపిక కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డుల ప్రకటనను అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి స్వాగతించాయి. ‘యుద్ధ సమయాల్లోనూ మహిళల హక్కులు, భద్రతను గుర్తించి కాపాడితేనే శాంతియుత ప్రపంచం సాకారమవుతుంది’ అని కమిటీ చైర్మన్ బెరిట్ రీస్ అండర్సన్ వ్యాఖ్యానించారు. యుద్ధాలు, సాయుధ దళాల సంఘర్షణల్లో లైంగిక హింస కట్టడికి పోరాడిన మక్వీజ్ జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు గడించారని పేర్కొన్నారు. మక్వీజ్, మురాద్ తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి లైంగిక నేరాలపై పోరాడారని కొనియాడారు. కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక, మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా పిలిచే మక్వీజ్..యుద్ధ సమయాల్లో మహిళలపై దాష్టీకాలను నిర్మొహమాటంగా ఖండించారు. 2014లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన మురాద్..మూడు నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలు, చిన్నారుల్లో మురాద్ కూడా ఒకరు. హాలీవుడ్‌ను కుదిపేసిన ‘మీటూ’ ఉదంతం వెలుగు చూసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లైంగిక నేరాలపై పోరాడి న వారికి నోబెల్ శాంతి బహుమతి దక్కడం విశేషం. వెల్లువెత్తిన అభినందనలు.. మక్వీజ్, మురాద్‌ల ధైర్య సాహసాలను యూరోపియన్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ కొనియాడారు. మక్వీజ్‌కు నోబెల్ దక్కిన వార్త వెలువడిన వెంటనే ఆయన ఆసుపత్రి ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. మురాద్‌కు నోబెల్ బహుమతి రావడం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరాక్ పౌరులందరికీ గర్వకారణమని ఆ దేశ అధ్యక్షుడు బర్హాం సలేహ్ అన్నారు. ఉగ్రవాదులకు ఇది చెంపపెట్టు అని, లైంగిక హింసకు గురైన బాధితుల పట్ల ఇరాక్ ప్రభుత్వం మరింత దృష్టిసారిస్తుందని ఆశిస్తున్నట్లు యాజిది ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. మురాద్, మక్వీజ్లు కాకుండా ఈ అవార్డుకు అర్హులు మరొకరు లేరని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ మిచెల్ బ్యాచ్‌లెట్ కితాబిచ్చారు. మరోవైపు, కాంగో ప్రభుత్వం మక్వీజ్‌ను అభినందిస్తూనే, ఆయన తన సేవలను రాజకీయం చేశారని విమర్శించింది. బాధితురాలే నాయకురాలై.. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఇరాక్‌కు చెందిన యాజిదీ యువతి మురాద్ నదియా (25)ది పోరాట గాథ. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉత్తర ఇరాక్‌లోని ఓ గ్రామంపై తెగబడ్డారు. మైనారిటీలైన కుర్దులుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలు, చిన్నారులను ఎత్తుకెళ్లారు. వారిలో మురాద్ నదియా (25) ఒకరు. వీరిని తీసుకెళ్లిన ఐఎస్ ఉగ్రవాదులు మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అందరిపై దారుణంగా, కిరాతకంగా వ్యవహరించారు. లైంగిక బానిసలుగా తమ వద్ద పెట్టుకుని దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డారు. మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా.. అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఆమె జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలైంది. తన లాగా మరెవరూ ఈ కిరాతక కూపంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారామె. శిబిరంలో బ్రిటీష్ లాయర్, హక్కుల కార్యకర్త అమల్ క్లూనీ పరిచయం ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే.. యాజిదీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి వివరించేలా చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై నదియా.. తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగానే.. దాదాపు నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్ నరకకూపం నుంచి విముక్తి లభించింది. ‘ద లాస్ట్ గర్ల్’ తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ‘ద లాస్ట్ గర్ల్’ పేరుతో నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అమల్ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. ఇరాక్‌లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించడం నదియా పోరాట ఫలితమే. ‘నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో నన్ను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చినందుకు అమ్మ, ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మోసూల్ పట్టణంలో మాలాగే.. ఓ 30 మంది బాధితులు ఉన్న శిబిరంలో పడేశారు. రోజూ ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపైనా ఆ దుర్మార్గులు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్ నాయకుడొకడు నన్ను తీవ్రంగా హింసించాడు. మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు. ఇలా హింసించడంలోనే ఆనందం ఉందన్నాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఐఎస్‌లో లైంగిక బందీగా ఉన్నప్పటి దారుణాలను నదియా వివరించారు. డాక్టర్ ‘మిరాకిల్’ మక్వీజ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. రాజకీయ హింస, అధికార, ప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మారింది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా లెక్కలేనన్ని కుటుంబాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇది చాలదన్నట్లు రెండు వర్గాలు మహిళలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఈ సంఘర్షణలో లెక్కలేనంత మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. అయితే.. లైంగిక హింస బాధితులను ఆదుకునేందుకు డాక్టర్ డెనిస్ మక్వీజ్ రెండు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. 1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్‌ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు ఈ డాక్టర్ రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు లెక్కలేనన్ని. తిరుగుబాటుదారులు ఎంత క్రూరంగా అత్యాచారాలు చేసే వారంటే కొందరు మహిళలకు ఒకటి కంటే ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. కాంగో మహిళలకు మక్వీజ్ అందిస్తున్న సేవల గురించి ‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయితే.. తమ చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. 2012లో తన ఇంటిపై దాడి చేసినపుడు అక్కడి నుంచి తప్పించుకుని యూరోప్ వెళ్లారు. ఆయన లేని సమయంలో పంజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగక బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరునెలల తర్వాత తిరిగి వచ్చిన మక్వీజ్‌కు బుకావ్ విమానాశ్రయం 21 మైళ్ల దూరమున్న పంజీ ఆసుపత్రి వరకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికారు. యూరప్‌లో ఉన్న సమయంలోనే మక్వీజ్.. ఐరాస వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా సుపరిచితుడైన ఆయన.. మహిళలపై లైంగిక దాడిని ‘భారీ విధ్వంసక ఆయుధం’గా అభివర్ణించారు. శాంతి బహుమతి ప్రకటన జరిగినపుడు కూడా ఆయన తన విధుల్లోనే (శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు) ఉన్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతికి డాక్టర్ మక్వీజ్ ఆరుసార్లు నామినేట్ కావడం విశేషం. -
‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’
ఒకప్పుడు ఐసిస్ బానిసగా మృగాళ్ల కబంధ హస్తాల్లో చిత్రవధ అనుభవించింది... కుటుంబాన్ని కోల్పోయింది.. మూడు నెలల పాటు తనపై కొనసాగిన అత్యాచారాలను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.. కానీ నాడు అలా చేసి ఉంటే ఆమె పేరు ప్రపంచానికి తెలిసేదే కాదు.. ఆమె లాంటి ఎందరో లైంగిక బానిసలకు విముక్తి లభించేదీ కాదు.. కష్టాల కడలిని దాటి లైంగిక బానిస నుంచి నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా గుర్తింపు పొందిన నదియా మురాద్ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. లైంగిక హింసకు వ్యతిరేకంగా.. సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం : లైంగిక హింసను అరికట్టేందుకు కృషి చేసినందుకు, అత్యాచార బాధితులకు అండగా నిలిచినందుకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్ ఎంపికయ్యారు. ఆఫ్రికాకు చెందిన గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్‌తో సంయుక్తంగా ఓస్లోలో డిసెంబరు 10న ఆమె శాంతి పురస్కారం అందుకోనున్నారు. అధికార దాహంతో వివిధ దేశాల్లో అంతర్యుద్ధానికి తెగబడుతున్న ఐసిస్ వంటి ఉగ్రమూకల రాక్షసక్రీడ(లైంగిక హింస)కు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగానే వీరిద్దరిని అవార్డు వరించింది. డెనిస్ బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. ఇరాక్‌కు చెందిన యాజాదీ యువతిగా తాను ఎదుర్కొన్న పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసి తన లాంటి ఎంతో మందిని ఆ నరకం నుంచి విముక్తులను చేసేందుకు తన వంతు కృషి చేశారు... చేస్తూనే ఉన్నారు. ఆ మూడు నెలలు నరకం.. ‘ నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో లో నన్ను కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో అడ్డొచ్చినందుకు మా అమ్మతో పాటు నా ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు, నా మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మెసూల్ పట్టణానికి తీసుకువెళ్లి ఇస్లాం మతంలోకి మార్చారు. మాలాంటి ఓ ముప్పై మంది బాధితులు ఉన్న శిబిరంలో మమ్మల్ని పడేశారు. రోజూ సుమారు అక్కడికి ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపై కూడా వాళ్లు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్ నాయకుడొకడు నన్ను తీవ్రంగా కొట్టాడు. చిత్రవధ చేశాడు. ఇలా హింసించే బదులు మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు సరికదా ఇలా హింసించడంలోనే ఆనందం ఉందంటూ వెకిలిగా నవ్వాడు. ఇదంతా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా లాంటి ఎంతో మంది యువతుల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి కదా. ఇంత పిరికిగా ఆలోచిస్తే లాభం లేదనుకుని తప్పించుకునే మార్గం కోసం అన్వేషించాను. ఆ సమయంలో మెసూల్లోని ఓ ముస్లిం కుటుంబం నాకు సహాయం చేసింది. అలా మూడు నెలల తర్వాత ఆ నరక కూపం నుంచి ఎలాగోలా బయటపడి శరణార్థుల శిబిరానికి చేరుకున్నాను. అయినా సిరియా- ఇరాక్ వంటి దేశాల్లో అంతర్యుద్ధం కొనసాగుత్నుంత కాలం యాజాదీల పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుందా అని నాకు నేనే సమాధానం చెప్పుకొన్నాను’ అంటూ యాజాదీగా పుట్టినందుకు ఐసిస్ ఉగ్రమూకల అకృత్యాలకు బలౌతున్న కుర్దిషియన్ వర్గానికి చెందిన యాజాదీ యువతుల దీన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు నదియా. ఆమె పరిచయంతో.. పోరాటం ఉధృతం శరణార్థుల శిబిరానికి చేరిన తర్వాత నదియా తమ బాధలను బాహ్య ప్రపంచానికి చెప్పే అవకాశం లభించింది. బ్రిటీష్ లాయర్, హక్కుల కార్యకర్త అమల్ క్లూనీ పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అమల్ ఇచ్చిన ప్రోత్సాహమే... తమకు జరుగుతున్న అన్యాయాన్ని నదియా ప్రపంచానికి చాటిచెప్పేలా చేసింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. అలా చేయడం ద్వారా సుమారు నాలుగున్నర లక్షల మంది బాధితులకు విముక్తి లభించింది. ‘ద లాస్ట్ గర్ల్’ ..బై నదియా మురాద్ తాను, తన వంటి యాజాదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ద లాస్ట్ గర్ల్ పేరిట నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి అమల్ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. అదే ఏడాది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇరాక్‌లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో నదియా పోరాటానికి ఫలితం దక్కినట్లైంది. కన్నీళ్లే కాదు.. ఆనంద భాష్పాలు ఉంటాయని చెప్పిన ప్రియనేస్తం చిన్న వయస్సులోనే లైంగిక బానిసగా మారిన నదియా బహుశా తన జీవితంలో పెళ్లి అనే వేడుక ఉంటుందని అస్సలు ఊహించలేదేమో. ఎందుకంటే అప్పటి వరకు మృగాళ్లనే చూసిన నదియాకు అబిద్ షముదీన్ పరిచయం కాలేదు. అతడు కూడా యాజాదీ హక్కుల కార్యకర్త. ఎంతోమంది బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తి. నదియా వ్యక్తిత్వానికి ముగ్ధుడైన అబిద్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆమెతో పంచుకున్నాడు. అబిద్‌పై ఉన్న అభిమానం ఆమె చేత సరేనని చెప్పించింది. ఈ క్రమంలోనే ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలోనే వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ‘మా యాజాదీలు అనుభవిస్తున్న కష్టాలే మమ్మల్ని దగ్గర చేశాయి. వారికోసం ఇప్పటి నుంచి ఒక్కటిగా కలిసి పోరాడతాం అంటూ తనకు కాబోయే భర్త గురించి తన సోషల్ మీడియా పేజీలో రాసుకొచ్చారు 25 ఏళ్ల నదియా మురాద్. జీవితంలో కన్నీళ్లే కాదు ఆనంద భాష్పాలు కూడా ఉంటాయని చాటి చెప్పిన తన ప్రియనేస్తం అబిద్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. -
డెనిస్, నదియాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో : ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి డెనిస్ ముక్వేజ్, నదియా మురాద్‌లు ఎంపికయ్యారు. లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన కృషికి, లైంగిక దాడి బాధితులకు చేసిన సహాయానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న సెక్సువల్ వాయిలెన్స్‌కు వ్యతిరేకంగా ఈ ఇద్దరూ పోరాటం చేశారు. డెనిస్ ముక్వేజ్ ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన గైనకాలజిస్ట్. ఆయన లైంగిక వేధింపుల బాధితులకు అండగా ఉంటూ వారికి వైద్యసహాయం అందించారు. ఇరాన్‌లోని యాజిది (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియా మానవ హక్కుల కోసం పోరాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కారణంగా తనపై జరిగిన లైంగిక హింసను, ఇతర యాజిది యువతులు అనుభవిస్తున్న నరకం గురించి ప్రపంచానికి తెలియజేశారు. యాజిది యువతులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు పాటుపడ్డారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్ని నిర్మూలించేందుకు డెనిస్, నదియా మురాద్‌లు చేసిన కృషిని నోబెల్ కమిటీ ప్రశంసిస్తూ పురస్కారాన్ని ప్రకటించారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతి 2017కు అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ సంస్థ (ఐసీఏఎన్) ఎంపికయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల నిర్మూలనకు ఈ సంస్థ చేస్తున్న కృషిని నోబెల్ కమిటీ ప్రశంసిస్తూ పురస్కారాన్ని ప్రకటించింది. -
చంపేస్తారనుకున్నా.. రేప్ చేస్తారనుకోలేదు!
కోజో: 'మమ్మల్ని అదే క్షణంలో కాల్చి చంపేస్తారనుకున్నాం. మాపై పాశవికంగా అత్యాచారాలు చేస్తారని మాత్రం ఊహించలేదు. ఎంతో సంతోషంగా ఏ కల్మషం లేకుండా నవ్వుతు ఉండే అమ్మాయిలను ఎత్తుకుపోయి అమ్మేస్తారు. ఆపై కొందరిని సెక్స్ బానిసలుగా చేసి చిత్రవధ చేస్తారు'. ఇవి ఐసిస్ చెర నుంచి తప్పించుకున్న ఇరాక్ యువతి నదియా మురాద్ విషాధ గాథ. తనను ఎక్కడైతే ఐసిస్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారో.. సరిగ్గా మూడేళ్ల తర్వాత తన స్వగ్రామం యాజిదికి చేరుకుని ఉద్వేగానికి లోనయ్యారు మురాద్. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు నదియా మురాద్. మూడేళ్ల కిందట తన జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనను గురువారం చెప్పుకొచ్చారు. '2014 వేసవిలో మా గ్రామం యాజిదిని ఒక్కసారిగా ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. కొన్ని నిమిషాల్లోనే మగవారు.. ఆడవారు అంటూ వేరు చేశారు. పురుషులందర్నీ మా కళ్లముందే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. దీంతో మమ్మల్ని కూడా చంపేస్తారని భావించాం. కానీ అలా జరగలేదు. మొసుల్ తీసుకెళ్లి యువతులను అమ్మేశారు. ఆ తర్వాత సిరియన్లు, ఇరాకీయులు, ట్యూనిషియన్లు, యూరోపియన్లు మాపై అత్యాచారం చేసేవాళ్లు. యాజిదీకి చెందిన 3వేలకు పైగా ఆడవాళ్లను బలవంతంగా తీసుకెళ్లి సెక్స్ బానిసలుగా చేశారు. అదృష్టవశాత్తూ అదే ఏడాది నవంబర్ లో నేను ఎలాగోలా ఆ నరకకూపం నుంచి తప్పించుకోగలిగాను' అంటూ నదియా మురాద్ తన గతాన్ని వెల్లడించారు. 2015లోనే ఐరాసలో తన మనోవేదనను మురాద్ ఎల్లగక్కారు. ఆపై యూరప్ పార్లమెంటేరియన్ కు ఇచ్చే సఖరోవ్ అవార్డుతో ఆమెను సత్కరించారు. 19 ఏళ్ల బషర్ అనే యువతి ఏకంగా కంటిని కోల్పోయారు. సెక్స్ బానిసగా ఉండేందుకు నిరాకరించినందుకు ఆమెకు ఆ గతి పట్టించారని ఐసిస్ చెర నుంచి తప్పించుకున్న తర్వాత విషయం వెలుగుచూసింది. చాలా కుటుంబాల్లో ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయని మురాద్ వివరించారు. -
నాడు బానిస.. నేడు గుడ్ విల్ అంబాసిడర్
లండన్: ఇస్లామిక్ ఉగ్రవాదుల చెరలో బంధీగా చిక్కి చిత్ర హింసలనుభవించి వారి చెరనుంచి బయటపడి తన లాంటి వారి విముక్తి కోసం పాటుపడుతోంది నదియా మురాద్(21). మహిళల ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా నదియా చేస్తున్న కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది. 2014 లో ఇరాన్ లోని యాదిజి (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇంట్లోంచి ఎత్తుకెల్లారు. అడ్డొచ్చిన సోదరులను, తల్లిని కళ్ల ముందే చంపేశారు.ఆమెను సెక్స్ బంధీగా చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఐసిస్ నుంచి బయటపడిన ఆమె ఇరాక్ లో యాదిజి వర్గ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇరాక్ లో ఉగ్రవాదులు మహిళలను అపహరించడం, అడ్డొచ్చిన వారిని చంపడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందిని వరకు అపహరించారు.వారి చెరలో 4 వేల మంది మహిళలు బంధీలుగా ఉన్నారు. వారి విముక్తి కోసం తన జీవితం అంకితమని నదియా ప్రకటించారు. -
'నా కథే బాధగా ఉంటే.. నాలాగా ఇంకెందరో..'
లండన్: ఒక్కసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతిలోపడితే వారు చూపించే నరకం అంతా ఇంతా కాదని యాజిది వర్గానికి చెందిన నదియా మురాద్ (21) అనే యువతి తెలిపింది. కొన్ని నెలల కిందట వారి చెరలో ఇరుక్కుని ఏదో ఒకలా బయటపడిన ఆమె ప్రస్తుతం ఐసిస్‌కు వ్యతిరేకంగా వారి బారిన పడిన మహిళలందరినీ ఏకం చేస్తోంది. లండన్‌లోని ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ హౌస్‌లో ఆమె మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని, ఉగ్రవాదుల చెరలో పలు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. 'నేను మాట్లాడేది నా ఒక్కదాని తరుఫున కాదు.. ఇరాక్ యుద్ధ క్షేత్రంలో ఇస్లామిక్ స్టేట్ చేతుల్లో ఇరుక్కుపోయిన అన్ని కుటుంబాలు, మహిళలు, చిన్నారుల తరుపున మాట్లాడుతున్నాను. యాజిదీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా నేను ప్రచారం ప్రారంభించి రెండు నెలలు పూర్తయింది. 5,800మంది యాజిదీ మహిళలను, చిన్నారులను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. వారిలో ఎంతోమందిని చంపేశారు. చాలాకుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేశారు. మా యాజిదీల్లో ఉగ్రవాదుల పురుషులను హత్య చేస్తారు. స్త్రీలను ఎత్తుకెళతారు. ఎత్తుకెళ్లిన తర్వాత హత్య చేయొచ్చు అత్యాచారం చేయవచ్చు.. వారి ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేయొచ్చు. ఇస్లాం పేరుమీద వారు ఎప్పుడు ఏం చేస్తారో ఊహించలేం. నా కుటుంబంలోనే ఆరుగురుని హత్య చేశారు. నా సోదరులను చంపేశారు. నా సోదరులను చంపుతుంటే మా అమ్మ చూసిందని ఆమెను చంపేశారు. నన్ను మోసుల్ కు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ సమయంలో నేను నా తల్లిని, సోదరులను మరిచిపోయాను. ఎందుకంటే ఓ మహిళపట్ల ఉగ్రవాదులు ఆ సమయంలో ప్రవర్తించే తీరు చావుకంటే భయంకరంగా ఉంటుంది. కొందరికీ నా ఈ కథే బాధకరంగా ఉండొచ్చు. కానీ నాకంటే కూడా బాధకరమైన కథలు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో 3,400మంది మహిళలు ఉన్నారు. ఏడాదిన్నరగా మాపై ఈ హత్యాకాండ ఆగడం లేదు' అని ఆమె వాపోయింది. ప్రపంచ దేశాలు తమకు సహాయం చేయాలని కోరింది.