'ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు నోబెల్ బహుమతి ఇవ్వాలి'
'ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు నోబెల్ బహుమతి ఇవ్వాలి'
Published Tue, May 13 2014 9:05 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: తాజా లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని వెల్లడిస్తున్న ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి చూపుతున్న ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. తక్కువ శాంపిల్స్ ను తీసుకుని భారత రాజకీయ వ్యవస్థపై ఓపినియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్న వారు నోబెల్ బహుమతికి అర్హులని సింఘ్వీ అన్నారు.
ఓ బిలియన్ లేదా పది బిలియన్ల ఓటర్లున్న దేశంలో 10, 20, 50, లేదా 90 వేలు, లక్ష శాంపిల్స్ తో ప్రజల మనోభావాల్ని, హృదయాలను లెక్కిస్తున్న వారికి ఈ బహుమతి ఇవ్వవచ్చని అనుకుంటున్నానని సింఘ్వీ అన్నారు. గత చరిత్ర, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. అదే తరహా శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్న నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైన అంశాన్ని సింఘ్వీ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ దిగజారి విమర్శలు చేశారని ఓ ప్రశ్నకు సింఘ్వీ సమాధానమిచ్చారు.
Advertisement
Advertisement