నమో నమామి...! | Exit polls project Narendra Modi-led NDA government | Sakshi
Sakshi News home page

నమో నమామి...!

Published Tue, May 13 2014 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నమో నమామి...! - Sakshi

నమో నమామి...!

  •  కేంద్రంలో ఎన్డీఏకు మెజారిటీ.. 
  •  రాష్ర్టంలో వైఎస్సార్‌సీపీ హవా -  తేల్చిచెప్పిన ఎగ్జిట్ పోల్స్
  •   యూపీఏ పాలనకు తెరేనని జోస్యం
  •   యూపీఏకు 70-148 స్థానాలే
  •   బీజేపీ కూటమికి 240-300 సీట్లు 
  •   కాంగ్రెస్ రెండంకెలకే పరిమితం
  •   బలీయ శక్తిగా ప్రాంతీయ పార్టీలు
  •   సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకి 
  •   18 లోక్‌సభ స్థానాలు: ఏబీపీ సర్వే
  •   టీఆర్‌ఎస్‌కు 8-12, టీడీపీకి 9 సీట్లు
  •  న్యూఢిల్లీ: చివరిదైన తొమ్మిదో దశ పోలింగ్‌తో సార్వత్రిక పోరుకు సోమవారం తెర పడింది. సాయంత్రం పోలింగ్ సమయం పూర్తవుతూనే జాతీయ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో హోరెత్తించాయి. మెజారిటీ పోల్స్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే జై కొట్టాయి. ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించడం ఖాయమేనని ఒకట్రెండు మినహా అన్నీ తేల్చేశాయి. మిగతావి కూడా బీజేపీ కూటమి మెజారిటీ సమీపానికి దూసుకొస్తుందని అభిప్రాయపడ్డాయి. పదేళ్ల యూపీఏ పాలనకు తెర పడ్డట్టేనని సర్వేలన్నీ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ‘‘కాంగ్రెస్ సారథ్యంలోని పాలక కూటమి కుదేలవడం ఖాయం. ‘ఇతర’ పక్షాల కంటే కూడా అతి తక్కువ సీట్లతో ఘోర పరాజయం మూటగట్టుకోనుంది’’ అని జోస్యం చెప్పాయి. ఎన్డీఏకు కనిష్టంగా 249 నుంచి 300 పైచిలుకు లోక్‌సభ స్థానాలు మిగతా 12వ పేజీలో ఠ 
     
     వస్తాయని, యూపీఏ కనాకష్టంగా 100 మార్కు దాటవచ్చని తేల్చేశాయి. బీజేపీ ఒంటరిగానే ఏకంగా 230 పై చిలుకు లోక్‌సభ స్థానాలు సాధిస్తుందని చాలా సర్వేలు పేర్కొనడం విశేషం. కాంగ్రెస్ మాత్రం లోక్‌సభ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా రెండంకెలకు పరిమితం కానుందని, 70 సీట్లు దాటితే గొప్పేనని విశ్లేషించాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ బలీయ శక్తులుగా ఎదగనున్నాయని అంచనా వేశాయి. తృణమూల్, అన్నాడీఎంకే, వైఎస్సార్‌సీపీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు వామపక్షాలు తదితరులందరికీ కలిపి 140 నుంచి 180 స్థానాల దాకా రావచ్చని అభిప్రాయపడ్డాయి. 543 మంది సభ్యులుండే లోక్‌సభలో మెజారిటీకి 272 స్థానాలు అవసరం.
     
     దేశవ్యాప్తంగా బీజేపీ హవాయే
     దేశవ్యాప్తంగా బీజేపీ ఆధిక్యమే కొనసాగిందని, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరిచిందని సర్వేలు పేర్కొన్నాయి. దక్షిణాదిలోని కొన్నిచోట్ల మాత్రమే కాంగ్రెస్‌కు, యూపీఏకు కాస్త ఆశాజనకంగా ఉందన్నాయి. న్యూస్24 చానల్ కోసం టుడేస్ చాణక్య నిర్వహించిన సర్వే అయితే ఎన్డీఏకు ఏకంగా 340 సీట్లు కట్టబెట్టింది. యూపీఏకు 70, ఇతరులకు 133 వస్తాయని పేర్కొంది. ఎన్డీఏకు 249, యూపీఏకు 148, ఇతరులకు 146 రావచ్చని ఓఆర్జీ మార్గ్ (టైమ్స్ నౌ) సర్వే చెప్పింది. ఇక ఎన్డీఏ 270-282, యూపీఏ 92-102 సీట్లు సాధిస్తాయని సీఎస్‌డీఎస్ (ఎన్డీటీవీ) సర్వే తేల్చింది. బీజపీకి ఒంటరిగానే 230 నుంచి 242 సీట్లు ఖాయమని, కాంగ్రెస్ మాత్రం 72-82 సీట్లతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఎన్డీఏకు 289 సీట్లు ఖాయమని సీ-ఓటర్ (ఇండియా టీవీ) సర్వే చెప్పింది. అందులో 249 సీట్లు ఒక్క బీజేపీకే ఖాయమంది. యూపీఏకు 101 సీట్లే వస్తాయని, అందులో కాంగ్రెస్ వాటా 78 అని జోస్యం చెప్పింది.
     
     యూపీలో కమల వికాసం
     అతి కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు బీహార్‌లో కూడా బీజేపీ బాగా ముందంజలో ఉందని సర్వేలు పేర్కొన్నాయి. యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏకు 46 దాకా వస్తాయని నీల్సన్, 52 గెలుస్తుందని ఓఆర్జీ మార్గ్, 45-53 రావచ్చని సీఎస్‌డీఎస్, 54 అని సి-ఓటర్ పేర్కొన్నాయి. కాంగ్రెస్ 10 సీట్లకు పరిమితం కావచ్చన్నాయి. టుడేస్ చాణక్య అయితే యూపీలో బీజేపీకి ఏకంగా 70 సీట్లిచ్చింది! ఇక 40 స్థానాలున్న మరో కీలక రాష్ట్రం బీహార్‌లో బీజేపీకి 28 సీట్ల దాకా వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఎల్జేపీతో కలిసి 21 సీట్లను కైవసం చేసుకోనుందని నీల్సన్ చెప్పింది. మహారాష్ట్రలోనైతే బీజేపీకి 21, దాని మిత్రపక్షం శివసేనకు 11 సీట్లు ఖాయమంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వార్ వన్ సైడేనని సర్వేలన్నాయి. రాజస్థాన్‌లోని 25 సీట్లూ దాదాపుగా కమలనాథులవేనని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని 40 సీట్లలో 35 దాకా వారి ఖాతాలోకే చేరతాయని చెప్పాయి. ఢిల్లీలో కూడా ఏడు స్థానాలూ బీజేపీవేనని పేర్కొన్నాయి. కొన్ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు సీట్లు రావచ్చన్నాయి. ఆశ్చర్యకరంగా పశ్చిమబెంగాల్, తమిళనాడుల్లో కూడా బీజేపీ ఖాతా తెరవనుందని సీఎన్‌ఎన్-ఐబీఎన్ తెలిపింది. కేరళలో 20 సీట్లకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 11-14 రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు కర్ణాటకలో 14 రావచ్చంటున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లకు పరిమితం కావచ్చని సర్వేలు చెప్పడం మరో విశేషం!
     
     ప్రాంతీయ పార్టీల హవా
     పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలీయమైన శక్తులుగా ఆవిర్భవించనున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 42 సీట్లలో 25-31 సొంతం చేసుకుంటుందని, వామపక్ష కూటమి 7-11 సీట్లతో మరోసారి కుదేలవుతుందని సీఎన్‌ఎన్-ఐబీఎన్ తెలిపింది. మరో సర్వే తృణమూల్‌కు 31 సీట్లిచ్చింది! తమిళనాట కూడా 39 సీట్లకు గాను జయలలిత సారథ్యంలోని పాలక అన్నాడీఎంకే 22-28, డీఎంకే 7-11, బీజపీ 4-6 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. ఒక సర్వే అయితే అన్నాడీఎంకేకు ఏకంగా 31 సీట్లిచ్చింది. 
     
     వాస్తవిక అంచనాలు: బీజేపీ
     ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని బీజేపీ పేర్కొంది. మోడీ నాయకత్వమే తమకు విజయ సోపానంగా మారనుందని పార్టీ అధికార ప్రతినిధి ప్రకశ్ జవదేకర్ అనగా, తాము మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ ధీమా వెలిబుచ్చారు. దేశానికి మోడీయే సారథ్యం వహించాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ శిబిరంలో నైరాశ్యం నెలకొంది. దీనిపై స్పందించేందుకు కూడా ఆ పార్టీ నేతలెవరూ ఆసక్తి చూపలేదు. పైగా ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో తాము పాల్గొనబోమని వారు ప్రకటించడం విశేషం. అయితే, నిత్యావసరాల ధరల పెరుగుదల కచ్చితంగా తమకు ప్రతికూలంగా పని చేసిందని కాంగ్రెస్ కీలక నేత రషీద్ అల్వీ అంగీకరించారు!
     
     వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం
     
     లోక్‌సభ పోరులో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించనుందని ఏబీపీ న్యూస్ సర్వే పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 18 స్థానాలు వస్తాయని తెలిపింది. టీఆర్‌ఎస్‌కు 8, టీడీపీకి 9, బీజేపీ, కాంగ్రెస్‌లకు చెరో 3, ఇతరులకు 1 స్థానం దక్కుతాయని వివరించింది. వైఎస్సార్‌సీపీకి 14, టీఆర్‌ఎస్‌కు 8, టీడీపీకి 9 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ సర్వే తెలిపింది. సీఎన్‌ఎన్-ఐబీఎన్ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 11 నుంచి 15, టీడీపీ-బీజేపీ కూటమికి 11 నుంచి 15 స్థానాలు వస్తాయని తేలింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటూ దక్కదని తేల్చింది. ‘‘సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకి 40 శాతం, టీడీపీ-బీజేపీలకు 43 శాతం, కాంగ్రెస్‌కు 7 శాతం ఓట్లు వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ 36 శాతం ఓట్లతో కేవలం 3 నుంచి 5 సీట్లకు పరిమితం అవుతుంది. టీఆర్‌ఎస్ 37 శాతం ఓట్లతో 8 నుంచి 12 సీట్లు కైవసం చేసుకోనుంది. 21 శాతం ఓట్లతో టీడీపీ-బీజేపీ కూటమి 2 నుంచి 4 సీట్లు గెలవనుంది’’ అని తెలిపింది.  టైమ్స్ నౌ చానెల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలంగాణలోని 17 సీట్లకు గాను టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 2 సీట్లు గెలుస్తాయని తెలిపాయి. సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ 8, టీడీపీ-బీజేపీ కూటమి 17 సీట్లు సాధిస్తాయని పేర్కొన్నాయి. ఇండియా టుడే గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ 1-3, టీడీపీ-బీజేపీకి 15-19, టీఆర్‌ఎస్ 10-14, వైఎస్సార్‌సీపీ 8-12 సీట్లు రావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement