
కోల్‌కతా: దేశానికి వన్నె తెచ్చే అంశమైనా సరే.. దాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మన నాయకులకు సర్వసాధరణం. తాజాగా ఇలాంటి పని చేసి వివాదంలో చిక్కుకున్నారు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ప్రవాస భారతీయుడు అయిన అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డును అందుకుంటున్నారు అభిజిత్. అయితే డఫ్లో విదేశి వనితే కాక అభిజిత్‌కు రెండో భార్య. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా అభిజిత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నోబెల్ ప్రైజ్ పొందాలంటే.. విదేశి వనితలను రెండో వివాహం చేసుకోవాలనుకుంటా. ఇన్నాళ్లు ఈ విషయం నాకు తెలియదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అభిజిత్ వామపక్షివాది అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ సిన్హా సమర్థించారు. వామపక్షవాదులం అనే ముసుగులో జనాలు.. ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. వామపక్ష విధానంలో ఆర్థిక వ్యవస్థ నడవాలని వారు కోరుకున్నారు. కానీ నేడు దేశంలో వామపక్ష విధానాలను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన న్యాయ్ పథకం రూపకల్పనలో అభిజిత్ ఒకరు కావడంతో బీజేపీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment