Rahul Sinha
-
బీజేపీ నేతలపై ఈసీ కొరడా, ప్రచారంపై ఆంక్షలు
న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ ఎన్నికల కమిషన్ మంగళవారం వారిపై చర్యలు తీసుకుంది. బీజేపీ నేత రాహుల్ సిన్హాపై 48 గంటల నిషేధాన్ని విధించింది. ఆ సమయం పూర్తయ్యేవరకు ప్రచారంలో పాల్గొనరాదని స్పష్టం చేసింది. మరోవైపు బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకుగానూ నోటీసులు ఇచ్చింది. నందిగ్రామ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సువేందు అధికారికి సైతం నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక చేసింది. ఎన్నికల ప్రచారాల్లో వీరు చేసిన వ్యాఖ్యలకుగానూ ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి మమతాపై సైతం ఎన్నికల కమిషన్ 24 గంటల నిషేధం విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత సువేందు అధికారి ఓ చోట ఎన్నికల ప్రచారంలో.. బేగమ్‌కు ఓటేస్తే మినీ పాకిస్తాన్ ఏర్పాటవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్య మళ్లీ చేయరాదని హెచ్చరించింది. మరోవైపు బీజేపీ నేత రాహుల్ సిన్హా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వకుండానే నిషేధం ప్రకటించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ చర్య తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సిన్హాపై మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల వరకూ నిషేధం ఉంటుందని పేర్కొంది. మరోవైపు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ ఫిర్యాదు చేయడంతో, బుధవారం ఉదయంకల్లా వివరణ ఇవ్వాల్సిందిగా దిలీప్‌ను ఈసీ ఆదేశించింది. ( చదవండి: మారణహోమం.. బీజేపీ కుట్ర ) -
‘నోబెల్ రావాలంటే.. భార్య ఫారినర్ కావాలేమో’
కోల్‌కతా: దేశానికి వన్నె తెచ్చే అంశమైనా సరే.. దాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మన నాయకులకు సర్వసాధరణం. తాజాగా ఇలాంటి పని చేసి వివాదంలో చిక్కుకున్నారు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ప్రవాస భారతీయుడు అయిన అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డును అందుకుంటున్నారు అభిజిత్. అయితే డఫ్లో విదేశి వనితే కాక అభిజిత్‌కు రెండో భార్య. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా అభిజిత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నోబెల్ ప్రైజ్ పొందాలంటే.. విదేశి వనితలను రెండో వివాహం చేసుకోవాలనుకుంటా. ఇన్నాళ్లు ఈ విషయం నాకు తెలియదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అభిజిత్ వామపక్షివాది అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ సిన్హా సమర్థించారు. వామపక్షవాదులం అనే ముసుగులో జనాలు.. ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. వామపక్ష విధానంలో ఆర్థిక వ్యవస్థ నడవాలని వారు కోరుకున్నారు. కానీ నేడు దేశంలో వామపక్ష విధానాలను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన న్యాయ్ పథకం రూపకల్పనలో అభిజిత్ ఒకరు కావడంతో బీజేపీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది. -
‘ఆరు నెలల్లో మమత సర్కారు కూలుతుంది’
కోల్కత్తా: బెంగాల్లో మరో ఆరు నెలల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేత రాహుల్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌పై పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నమ్మకం లేదని మమత సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఆ తరువాత బెంగాల్లో పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన విషయం తెలిసిందే. టీఎంసీ, సీపీఎంకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు బుధవారం బీజేపీ గూటికి చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ సిన్హా వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కాగా బెంగాల్ అసెంబ్లీకి 2021 వరకు గడువున్న విషయం తెలిసిందే. బుధవారం ఓ సమావేశంలో రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. ‘‘ఆరు నెలలు లేదా ఏడాది లోపు మమత సర్కార్ పడిపోనుంది. ఆ పార్టీలో చాలామంది ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. పోలీసులు, సీఐడీ బలంతో మమత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేంద్రంపై కోపంతో టీఎంసీ నేతలు రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తున్నారు’’ అని అన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో పర్యటించిన మోదీ 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మాట్లాడారని విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో 42 స్థానాలకు గాను బీజేపీ అనుహ్యంగా 18 స్థానాల్లో గెలుపొంది తృణమూల్‌కు పెద్ద ఎత్తున గండికొట్టిన తెలిసిందే. టీఎంసీ 22 సీట్లతో సరిపెట్టుకుంది. -
అఖిలేష్ చేసిన పెద్దతప్పు అదే
కోల్ కత్తా: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ దెబ్బకు ఎస్పీ-కాంగ్రెస్ ల కూటమి కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ తో జతకట్టి అతిపెద్ద తప్పు చేశారని బీజేపీ అంటోంది. ''సమాజ్ వాద్ పార్టీ అతిపెద్ద తప్పు కాంగ్రెస్ తో చేతులు కలుపడం. కాంగ్రెస్ తో చేతులు కలుపక పోయినప్పటికీ అఖిలేష్ ఈ ఎన్నికల్లో ఓడిపోయేవారు. కానీ ఇంత చిత్తుగా కాదు'' అని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. ప్రజలు నూతన భారత్ కు మద్దతుగా నిలిచారని, ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో తాము ఘన విజయం సాధించామని చెప్పారు. గోవా, మణిపూర్ లో కూడా తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇతర పార్టీలు, అభ్యర్థులు తమకు మద్దతిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు. 403 అసెంబ్లీ సీట్లలో యూపీలో బీజేపీ 312 సీట్లను గెలుచుకోగా.. పొత్తులతో మరో 13 సీట్లు బీజేపీకి దక్కబోతున్నాయి. ఉత్తరాఖాండ్ లో మొత్తం 70 సీట్లకు గాను 57 సీట్లు బీజేపీనే వరించాయి. గోవా, పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సీట్లను దక్కించుకోగా.. ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇక ఒక్క పంజాబ్ లోనే బీజేపీకి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. -
దీదీకి మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా: పార్టీ ఎంపీలు శారదా స్కామ్ కేసులో చిక్కుకొని ఇప్పటికే కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ కేబినెట్లో శరణార్థుల సహాయ, పునరావాస శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కుమారుడు సుబ్రతతో సహా గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ సిన్హా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంజుల్ విలేకర్లతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. పార్టీలోనూ విచిత్ర పోకడలున్నాయి. నా వర్గానికి(మతువా సామాజికవర్గం) ప్రయోజనం చేకూరే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం నన్ను అడ్డుకుంటోంది. 2011 ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు’ అని ఆరోపించారు. ఫిబ్రవరి 13న బంగ్వానా ఉపఎన్నిక జరుగుతుండగా మంజుల్ వెళ్లిపోవడం తృణమూల్‌కు ఇబ్బందిగా మారింది. ఆయన సోదరుడు, టీఎంసీ ఎంపీ కపిల్ కృష్ణ ఠాకూర్ గతేడాది అక్టోబర్ 13న చనిపోవడంతో దీనికి ఉపఎన్నిక జరుగుతోంది. అయితే తన సోదరుడు సహజంగా మరణించలేదని, ఏదో కుట్ర జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని మంజుల్ కృష్ణ డిమాండ్ చేశారు.