న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ ఎన్నికల కమిషన్ మంగళవారం వారిపై చర్యలు తీసుకుంది. బీజేపీ నేత రాహుల్ సిన్హాపై 48 గంటల నిషేధాన్ని విధించింది. ఆ సమయం పూర్తయ్యేవరకు ప్రచారంలో పాల్గొనరాదని స్పష్టం చేసింది. మరోవైపు బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకుగానూ నోటీసులు ఇచ్చింది. నందిగ్రామ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సువేందు అధికారికి సైతం నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక చేసింది. ఎన్నికల ప్రచారాల్లో వీరు చేసిన వ్యాఖ్యలకుగానూ ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ముఖ్యమంత్రి మమతాపై సైతం ఎన్నికల కమిషన్ 24 గంటల నిషేధం విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత సువేందు అధికారి ఓ చోట ఎన్నికల ప్రచారంలో.. బేగమ్‌కు ఓటేస్తే మినీ పాకిస్తాన్ ఏర్పాటవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్య మళ్లీ చేయరాదని హెచ్చరించింది. మరోవైపు బీజేపీ నేత రాహుల్ సిన్హా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వకుండానే నిషేధం ప్రకటించింది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ చర్య తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సిన్హాపై మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల వరకూ నిషేధం ఉంటుందని పేర్కొంది. మరోవైపు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ ఫిర్యాదు చేయడంతో, బుధవారం ఉదయంకల్లా వివరణ ఇవ్వాల్సిందిగా దిలీప్‌ను ఈసీ ఆదేశించింది.
( చదవండి: మారణహోమం.. బీజేపీ కుట్ర )
Comments
Please login to add a commentAdd a comment