దీదీకి మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా: పార్టీ ఎంపీలు శారదా స్కామ్ కేసులో చిక్కుకొని ఇప్పటికే కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ కేబినెట్‌లో శరణార్థుల సహాయ, పునరావాస శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కుమారుడు సుబ్రతతో సహా గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ సిన్హా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంజుల్ విలేకర్లతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు.
పార్టీలోనూ విచిత్ర పోకడలున్నాయి. నా వర్గానికి(మతువా సామాజికవర్గం) ప్రయోజనం చేకూరే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం నన్ను అడ్డుకుంటోంది. 2011 ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు’ అని ఆరోపించారు. ఫిబ్రవరి 13న బంగ్వానా ఉపఎన్నిక జరుగుతుండగా మంజుల్ వెళ్లిపోవడం తృణమూల్‌కు ఇబ్బందిగా మారింది. ఆయన సోదరుడు, టీఎంసీ ఎంపీ కపిల్ కృష్ణ ఠాకూర్ గతేడాది అక్టోబర్ 13న చనిపోవడంతో దీనికి ఉపఎన్నిక జరుగుతోంది. అయితే తన సోదరుడు సహజంగా మరణించలేదని, ఏదో కుట్ర జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని మంజుల్ కృష్ణ డిమాండ్ చేశారు.