రేణిగుంట/ఏర్పేడు(తిరుపతి జిల్లా): గగన్‌యాన్ తరహాలో సముద్రయాన్‌కు భారత శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెన్ సెక్రెటరీ, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రవిచంద్రన్ తెలిపారు. డీప్ ఓషన్ టెక్నాలజీ మిషన్‌లో భాగంగా సముద్ర వనరులు, సముద్రగర్భంలోని జీవ వైవిధ్యంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు చెప్పారు.
తిరుపతి ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞానభారతి సంయుక్తంగా తిరుపతి ఐఐటీలో మంగళవారం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో రవిచంద్రన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..ముగ్గురు ఆక్వానాట్స్‌తో ప్రయాణం చేయడానికి అనువైన జలాంతర్గామిని ఈ పరిశోధనకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ వంటి సముద్ర ఆర్థిక వనరులను సమగ్రంగా గుర్తించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ సారస్వత్ మాట్లాడుతూ..సమాజ స్థితి గతులను సైన్స్ మారుస్తుందన్నారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ బికే దాస్ డీఆర్డీవో సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ..జ్ఞానం లేని విద్య, మానవత్వం లేని మనిషి వ్యర్థమన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఐఎస్‌టీఎఫ్(తిరుపతి) ప్రెసిడెంట్ నారాయణరావు, విజ్ఞాన భారతి ప్రతినిధి త్రిస్టా ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment