అమెరికాలో 9.5 లక్షల మంది భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు!
ఆసియా నుంచి అత్యధికంగా వలస వెళ్లింది భారత్ నుంచే..
2003 నుంచి 2013కు 85 శాతం పెరిగిన సంఖ్య
ఎన్‌సీఎస్‌ఈఎస్ తాజా నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: ఆసియా దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఆసియా ఖండంలోని 29.60 లక్షల మంది వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 2013 నాటికి భారత్ నుంచి 9.50 లక్షల మంది అగ్రరాజ్యంలో పనిచేస్తున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌సీఎస్‌ఈఎస్) పేర్కొంది. 2003తో పోలిస్తే వారి సంఖ్య 85 శాతం పెరిగిందని వివరించింది. అలాగే అదే కాలానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన వారి సంఖ్య 53 శాతం, హాంకాంగ్, మకావు సహా చైనాకు చెందిన వారి సంఖ్య 34 శాతం పెరిగినట్లు ఎన్‌సీఎస్‌ఈఎస్ తెలిపింది.
2003లో 2.16 కోట్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అమెరికాలో ఉండగా 2013 నాటికి వారి సంఖ్య 2.9 కోట్లకు చేరిందని నివేదిక పేర్కొంది. ఇందులో వలస వచ్చిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సంఖ్య 34 లక్షల నుంచి 52 లక్షలకు పెరిగిందని నివేదిక వివరించింది. 2013 గణాంకాల ప్రకారం 63 శాతం మంది అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు జన్మతః పౌరులుకాగా 22 శాతం మంది శాశ్వత నివాసితులు, 15 శాతం మంది తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న వారు ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ఈఎస్ చెప్పింది.
ఈ నివేదిక ప్రకారం 2013 నాటికి వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 57 శాతం మంది ఆసియా ఖండంలో పుట్టినవారు ఉండగా 20 శాతం మంది ఉత్తర అమెరికా ఖండం (అమెరికాను మినహాయించి), సెంట్రల్ అమెరికా, కరీబియన్ లేదా దక్షిణ అమెరికాలో పుట్టిన వారు, 16 శాతం మంది యూరప్‌లో పుట్టిన వారు, 6 శాతం ఆఫ్రికాలో పుట్టిన వారు ఉన్నారు. 2013లో 32 శాతం మంది వలస శాస్త్రవేత్తలు తమ అత్యధిక విద్యాభ్యాసం మాస్టర్స్ డిగ్రీ అని చెప్పగా 9 శాతం మంది తమ అత్యధిక విద్యాభ్యాసం డాక్టరేట్ అని చెప్పారు.
అమెరికాలో పుట్టిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో సమానంగా 2013లో 80 శాతం మందికిపైగా వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉపాధి పొందారు. వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో అత్యధికంగా 18 శాతం మంది కంప్యూటర్, గణిత శాస్త్రాల్లో పనిచేస్తుండగా 8 శాతం మంది ఇంజనీరింగ్‌లో పనిచేస్తున్నారు.