అంతరిక్షంలోకి... ఆశలయానం | Sakshi Editorial On ISRO Chandrayaan-3 space | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలోకి... ఆశలయానం

Published Fri, Jul 14 2023 12:27 AM | Last Updated on Fri, Jul 14 2023 4:15 AM

Sakshi Editorial On ISRO Chandrayaan-3 space

అంతరిక్ష శోధనలో పెను ముందంజకు భారత్‌ సర్వసన్నద్ధమవుతోంది. ప్రపంచాళికి ప్రత్యేక ఆకర్షణున్న జాబిల్లికి సంబంధించి ఇతఃపూర్వం బయటపడని రహస్యాలను అందరితో పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. శుక్రవారం శ్రీహరికోట నుంచి చంద్రుని వైపు రివ్వున నింగిలోకి ఎగసే ఉపగ్రహ వాహక నౌకతో ముచ్చటగా మూడోసారి మన చందమామ యాత్ర సాగనుంది.

గత యాత్రలకు భిన్నంగా, చంద్రుని అధ్యయనంతో పాటు, ఇతరగ్రహాలపై జీవాన్ని కనుగొనడంలోనూ సాయపడుతుందని ఆశిస్తున్న ప్రయోగమిది. మునుపు ఏ దేశమూ చేయనిరీతిలో క్లిష్టమైన చంద్రమండల దక్షిణ ధ్రువం వద్ద చందమామతో చెట్టాపట్టాలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న శాస్త్రవిజ్ఞాన సాహసమిది. కోట్లాది భారతీయులే కాక, ప్రపంచమంతా ఆసక్తిగా పరికిస్తున్నది అందుకే! 

దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ తాజా యాత్రకు ముందు రెండుసార్లు భారత్‌ చంద్రమండల గవేషణ సాగించింది. 2008 అక్టోబర్‌ నాటి చంద్రయాన్‌–1లో భాగంగా ప్రయోగించిన 35 కిలోల ‘మూన్‌ ఇంప్యాక్ట్‌ ప్రోబ్‌’ (ఎంఐపీ) చంద్రుని కక్ష్యలో ప్రవేశించి, పరిశోధనలు సాగించి చంద్రుని ఉపరితలంపై నీటి జాడను కనుగొంది. ఇక, చంద్రుని ఉపరితలంపై దిగి, అన్వేషణ జరిపేందుకు ఉద్దేశించిన 2019 సెప్టెంబర్‌ నాటి చంద్రయాన్‌–2 పాక్షికంగానే విజయవంతమైంది.

ఎనిమిది పరికరాలతో కూడిన ల్యూనార్‌ ఆర్బిటర్‌ను విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి పంపగలిగాం కానీ, జాబిల్లిపై దిగే రోవర్‌ (‘ప్రజ్ఞాన్‌’)ను మోసుకుపోతున్న ల్యాండర్‌ (‘విక్రమ్‌’) మాత్రం తుదిక్షణాల్లో కుప్పకూలి, ప్రయోగం పూర్తి సఫలం కాలేదు. మామూలు భాషలో చెప్పాలంటే, మార్గనిర్దేశక సాఫ్ట్‌వేర్‌లో లోపంతో ఆ క్రాష్‌ ల్యాండింగ్‌ జరిగిందట. ఇప్పుడు మళ్ళీ చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగేలా రెండోసారి చేస్తున్న ప్రయత్నమే... ఈ చంద్రయాన్‌–3.అంతా సవ్యంగా సాగితే, ప్రయోగించిన దాదాపు నెల తర్వాత చంద్రయాన్‌–3 చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది.

దానిలోని ల్యాండర్, రోవర్‌లు ఆగస్ట్‌ 23న చంద్రునిపై కాలూనతాయి. ‘చంద్రయాన్‌–2’లో తగిలిన దెబ్బల రీత్యా... ఎదురయ్యే ఇబ్బందులు, ఎదుర్కొనే మార్గాలతో ‘వైఫల్యం – సురక్షిత పరిష్కార’ విధానంలో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దారు. ఈసారీ చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరలో 70 డిగ్రీల వద్దే ఉపగ్రహాన్ని దింపనున్నారు. అయితే, గతం నేర్పిన పాఠంతో కచ్చితంగా నిర్ణీత స్థలంలో అని కాక, 4 కి.మీ. “ 2.4 కి.మీ.ల వైశాల్యంలో ఎక్కడైనా సురక్షితంగా దిగేలా సూచనలిచ్చారు.

అవసరమైతే సుదూరం ప్రయాణించి, ప్రత్యామ్నాయ స్థలంలో దిగేలా ల్యాండర్‌లో మరింత ఇంధనం చేర్చారు. ల్యాండర్‌ స్వయంగా తీసే చిత్రాలకు తోడు మునుపటి చంద్రయాన్‌–2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను సైతం దానికి అందుబాటులో ఉంచారు. తద్వారా సరైన ప్రాంతానికి చేరినదీ, లేనిదీ నిర్ధరించుకొనేలా ఏర్పాటు చేశారు. అధిక వేగంలోనూ దిగేలా ల్యాండర్‌ కాళ్ళను ఈసారి దృఢంగా తీర్చిదిద్దారు. అదనపు సౌర ఫలకాల్ని ల్యాండర్‌కు అమర్చారు.

అసలు చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడమనేదే సంక్లిష్ట ప్రక్రియ. వైఫల్యాలూ సహజమే. సఫలమైన ఘనత అమెరికా, రష్యా, చైనాలదే. వాటి సరసన నిలవడమే గొప్పయితే, ఇప్పటి దాకా ఎవరూ వెళ్ళని, కనీసం వెలుగైనా తాకని ధ్రువప్రాంతంలో తొలిసారి దిగి, అక్కడి పరిస్థితుల్ని శోధించాలన్న భారత ప్రయత్నం నిస్సందేహంగా అపూర్వమే.

చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపి, అమెరికా, రష్యా, చైనాల సరసన నిలవాలని పలుదేశాలు గతంలో ప్రయత్నించాయి. 2019లో మనమే కాక ఇజ్రాయెల్‌ చేసిన ప్రయోగమూ విఫలమైంది. 2022లో వ్యోమనౌకతో ల్యాండర్‌ – రోవర్‌ను పంపాలని ప్రయత్నించిన జపాన్, అలాగే రోవర్‌ను పంపజూసిన యూఏఈ సైతం చతికిలబడ్డాయి. 

సఫలమైన దేశాలన్నీ ఉష్ణోగ్రత, ఉపరితలం రీత్యా సురక్షితమూ, సులభమైన చంద్రమండల భూమధ్యరేఖ వద్ద ఉపగ్రహాన్ని దింపాయి. లోయలు, అగ్నిబిలాలు లేకుండా సౌరశక్తికి పుష్కలమైన సూర్యరశ్మి ఉండే ఆ ప్రాంతంలో పరికరాలు దీర్ఘకాలం పనిచేస్తాయి. కానీ, చంద్రయాన్‌–3 చేరదలిచిన ధ్రువప్రాంతం మైనస్‌ 230 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే క్లిష్టమైన అసూర్యంపశ్య.

సెంటీమీటర్ల మొదలు వేల కిలోమీటర్ల పరిమాణంలో బిలాలు ఉంటాయి. తాజా ప్రయోగం సఫలమైతే, తొట్టతొలిగా అలాంటి దక్షిణ ధ్రువం వద్ద దిగిన మిషన్‌గా చంద్రయాన్‌–3 మన దేశానికి ఘనకీర్తి కట్టబెడుతుంది. చంద్రమండల రహస్యాల శోధన, ఛేదనలో మన జెండా రెపరెపలాడుతుంది. వలస పాలన నుంచి బయటపడ్డ అనేక దేశాలతో పోలిస్తే మనం అనూహ్యపురోగతి సాధించినట్టవుతుంది.

జాబిల్లిపై ధ్రువాల వద్ద గడ్డకట్టిన చలిలో చిక్కిన శిలలు, మట్టి కాలగతికి దూరంగా స్తంభించిన ఆదికాలపు సౌరవ్యవస్థ తాలూకు ఆచూకీని పట్టివ్వగలవు. అలా విశ్వరహఃపేటిక తెరుచుకుంటుంది. భూమి నుంచి చంద్రునితో పాటు, చంద్రుడి నుంచి దివినీ, భువినీ చూసేందుకు కొత్త లోచూపు కలుగుతుంది. సోదర గ్రహాన్ని జయించామని మనిషి సంబరపడిన ప్రతిసారీ సృష్టి విసిరే సరికొత్త సవాళ్ళకు సిద్ధమవడానికి ఉత్సాహం పొంగుతుంది.

చంద్రునిపై శాశ్వత స్థావరాలు నెలకొల్పడం భౌగోళిక రాజకీయ పోరులో లక్ష్యమైన వేళ ఇది భారత్‌కు అతి పెద్ద సానుకూల అంశం. అనేక ప్రయోగాలతో విశ్వవేదికపై శాస్త్రీయంగా, రాజకీయంగా జాబిల్లికి ఆకర్షణ, ప్రాధాన్యం అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం ముందు వరుసలో నిలుస్తుంది. ఇన్ని ఉద్విగ్నభరిత కోణాలున్న ఈ అంతరిక్ష యానంలో చివరకు ‘అందెను నేడే అందని జాబిల్లి’ అని భారత్‌ విజయగీతికలు ఆలపించాలని ఆకాంక్ష. అస్తు! అందుకై అహరహం శ్రమిస్తున్న మన శాస్త్రవేత్తల సమూహానికి విజయోస్తు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement