76 ఏళ్ల స్వతంత్ర భారతదేశం సాధించిన ఘనతల పరంపరలో తాజాగా ‘చంద్రయాన్–3’ వచ్చి చేరడం కేంద్రంలోని పాలక పార్టీ బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఇస్రో శాస్త్రవేత్తలు సల్పిన నిర్వరామ కృషి ఎన్డీఏ ప్రభుత్వ విజయంగా మారింది. కొన్ని దశాబ్దాల క్రితం రాకెట్లను ఎడ్ల బండ్లపై తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా... తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు వారు నిస్వార్థంగా కృషి చేస్తూనే ఉన్నారు. చంద్రయాన్–3 విజయం భారత్ ప్రతిష్ఠను అమాంతం ఆకాశం అంత ఎత్తుకు పెంచేసింది. చంద్రయాన్–3 తర్వాత సూర్యయాన్ వైపు ఇస్రో శాస్త్రవేత్తలు తమ కృషిని సాగించడమూ భారతీయులందరికీ గర్వకారణమే.
అయితే, దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన ఈ ఘనత, అభివృద్ధి అన్ని రంగాలలో ప్రతిఫలిస్తు న్నాయా? అనివార్యంగా వేసుకోవలసిన ప్రశ్న ఇది. అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు కొలమానంగా మానవాభివృద్ధి సూచిక, శిశు మర ణాల రేటు, పార్లమెంట్‌లో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ అంశాల ఆధారంగా భారత్‌తోపాటు ఇంచుమించుగా అదే సమయంలో స్వాతంత్య్రం పొందిన దేశాలు, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ప్రగతిని బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది.
ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించిన అభివృద్ధి నివేదికలలో పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు; జీ7 కంట్రీస్‌గా పిలవబడే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డవ్‌ు, యునైటెడ్ స్టేట్స్‌లు; ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, హంగరీ, ఇండోనేషియా, ఇరాన్, మలేసియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలెండ్, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సాధించిన ర్యాంకింగ్‌ల ఆధారంగా అక్కడి స్థితిగతులు అర్థమవు తాయి.
పైన పేర్కొన్న దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)ని పరిశీలిస్తే, 1960 నుంచి 2022 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో భారత్‌ది అడుగు నుంచి మూడవ స్థానం. కేవలం పాకిస్తాన్, నేపాల్ మాత్రమే భారత్ కంటే దిగువన ఉన్నాయి. 1950 నుంచి 2021 మధ్య కాలంలో 31 దేశాల మానాభివృద్ధి సూచికలను పరిశీలించినప్పుడు భారత్ 1950లో 26వ స్థానంలో ఉండగా, 2021 నాటికి 29వ స్థానానికి పడిపోయింది.
32 దేశాల్లో శిశు మరణాలకు సంబంధించి 1960–1975 మధ్య కాలంలో, ఆ తర్వాత 2021 వరకు నమోదైన గణాంకాలను పరి శీలిస్తే... 1960–1975 మధ్య అత్యధిక శిశు మరణాలు నమోదైన దేశాలలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 2021 నాటికి ఆ స్థానం మరింత దిగజారి కింది నుంచి 3వ స్థానానికి చేరుకొంది.
పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం అంశంలో 31 దేశాలలో 1997 నుంచి 2022 మధ్యకాలంలో భారత్‌ది 21వ స్థానం. 1997–98లో భారత్ పార్లమెంట్‌లో మహి ళల ప్రాతినిధ్యం 7 శాతం ఉండగా, 2022 నాటికి అది 14.9 శాతంకు పెరిగింది. 140 దేశాల కంటే భారత్ పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఎక్కడైతే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందో, ఆ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నా యని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక.. విద్యుత్, ఇంటర్నెట్ సేవల రంగాలలో మాత్రం భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 1993–2000 మధ్య కాలంలో దేశంలో 50 శాతం జనాభాకు మాత్రమే విద్యుత్ సౌకర్యం అందు బాటులో ఉండగా, ప్రçస్తుతం దేశంలో 99 శాతం మందికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక, ఇంటర్నెట్ సేవల రంగాన్ని పరిశీ లిస్తే, 2020 నాటికి భారత్‌లో 43 శాతం జనాభాకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత్ పౌరహక్కులు, లింగ సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలలో ఎంతో వెనుకబడింది. మానవా భివృద్ధి సూచికల్లో ప్రధానమైన అంశంగా పౌరహక్కులను పరిగణిస్తారు. పౌరహక్కులలో భారత్ స్థానం 92గా ఉంది. అంటే, భారత్ కంటే 91 దేశాలు మెరుగైన పరిస్థి తుల్లో ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడకు పలు రాజ్యాంగ వ్యవస్థలు దోహదం చేస్తాయి. అయితే, గత కొంతకాలంగా దేశంలోని పలు రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరిచే ప్రయత్నాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అతి ముఖ్యమైన అంశం.
ఆ బాధ్యతను నిర్వహించే స్వతంత్ర సంస్థ ‘భారత ఎన్నికల కమిషన్’నే పూర్తిగా తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలను కేంద్రంలో అధికా రంలో ఉన్నవారు చేయడం ఆశ్చర్యకరం. భారత ఎన్నికల కమిషన్ తరఫున చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు బాధ్యతలు నిర్వహిస్తారు.
వారి నియామ కాలను చేపట్టే విధానాన్ని సమూలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఆ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి బదులుగా ఒక కేంద్ర మంత్రి నియమితులవుతారు.
ఆ కేంద్రమంత్రిని ప్రధాన మంత్రే సభ్యుడిగా నియమిస్తారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు పూర్తిగా మారి పోతాయి. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం అన్నది ఇకపై ఉండకపోవచ్చు. ఇది దేశ ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే చట్టం.
శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని, ఐటీని, సేవల రంగంలోని అభివృద్ధినీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా అందుబాటులోకి వచ్చిన అభివృద్ధినీ చూపి ఇదే దేశాభివృద్ధిగా చాటుకుంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. అభివృద్ధికి నిర్వచనం మార్చేసి మేడిపండు లాంటి అభివృద్ధి చూపి అదే అభివృద్ధి అని ప్రచారం చేస్తే ఎలా? ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నమని వేరే చెప్ప వలసిన అవసరం లేదు.
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు
ఇది మాత్రమే అభివృద్ధి కాదు!
Published Thu, Sep 7 2023 12:36 AM | Last Updated on Thu, Sep 7 2023 12:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment