పట్నా : ఒక పక్క విచ్చలవిడి తుపాకీ సంస్కృతితో అమెరికాలో రోజుకో రక్తచరిత్ర నమోదవుతుండగా.. మన దేశంలో కూడా అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఆకలిగా ఉందని మామిడి పళ్లు కోసుకోవడానికి ఒక తోటలోకి ప్రవేశించిన బాలున్ని యజమాని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని గోర్గి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేర్‌గర్ గ్రామ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న పన్నెండేళ్ల పిల్లాడు పక్కనే ఉన్న తోటలోకి మామిడి పళ్లు కోసుకుందామని వెళ్లాడు.
అక్కడే కాపలాగా ఉన్న యజమాని బాలున్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. భయంతో పిల్లాడు పారిపోయేందుకు యత్నించడంతో తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ సరాసరి తలలోకి దూసుకుపోవడంతో మైనర్ బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన మృతుని స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమచారం అందించారని ఎస్సై తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటన అనుకోకుండా జరిగిందా.. లేదా వేరెవరినో కాల్చే క్రమంలో పొరపాటున పిల్లాడు బలయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, తోట కాపలాదారుని వద్ద తుపాకీ ఎందుకుందనే విషయం కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment