
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి లోకమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురు చూస్తోంటే.. బులంద్‌షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థి మాత్రం తన సహచరుడిపై పగతో రగిలిపోయాడు. క్లాస్ రూంలో జరిగిన చిన్న తగాదాకే పథకం ప్రకారం తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. ఇద్దరూ మైనర్ బాలురు కావడం, నిందితుడు తరగతి గదిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడటం ఆందోళన రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే. కేవలం సీటుకోసం నిన్న (బుధవారం) ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు తన మామయ్య తుపాకీని పాఠశాలకు తీసుకెళ్లి మరీ గురువారం ఉదయం బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అంతేకాదు నిందితుడి బ్యాగులోమరో నాటు తుపాకీ కూడా ఉండటం పోలీసులను కూడా విస్మయపర్చింది. సైన్యంలోపనిచేస్తూ, ప్రస్తుతం సెలవులో ఉన్న తన మామ లైసెన్స్‌డ్ తుపాకీని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు. ఘటనా స్థలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment