ప్రతీకాత్మక చిత్రం
మీరట్: ఆ ఇంట్లో అంరగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇంకా కొద్దిసేపట్లో వివాహతంతు ముగుస్తుందనగా ఒక వ్యక్తి తుపాకీతో మంటపంలోకి ప్రవేశించాడు. వచ్చీ రాగానే తుపాకీతో కాల్పులు జరిపాడు. తుపాకీ తూటాలకు ఒక వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలగా.. మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పటివరకు ఆహ్లదకరంగా ఎంతో సంతోషంగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని సరూర్‌పూర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని 18 ఏళ్ల సుమిత్‌గా.. గాయపడిన వ్యక్తిని అంకుర్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత అగంతకుడు సురేంద్ర అలియాస్ కల్లు.. సుమిత్‌పై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సుమిత్‌తో ఉన్న పాత గొడవల కారణంగానే సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే సుమిత్ శరీరంలోకి దూసుకెళ్లిన బులెట్ పక్కనే ఉన్న అంకుర్‌ను గాయపరిచిందన్నారు. అయితే నిందితుడు సురేంద్ర కాల్పులు జరిపి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
కాగా పోస్టుమార్టం నిమిత్తం సుమిత్‌ను తరలిస్తుండగా.. కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకోలేదు. సుమిత్ మృతికి కారణమైన సురేంద్రను మాకు అప్పగించాలని కోరినా పోలీసులు అందుకు నిరాకరించారు. మూడు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా.. చివరికి పోలీసులు ఎలాగోలా సుమిత్ కుటుంబసభ్యులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment