rivalries
-
టీఆర్ఎస్ కారులో కయ్యం.. ఏందబ్బా ఇది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఇప్పటికే కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్య నేతల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25వ తేదీ శుక్రవారం పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటు చేసుకున్న సంఘటన జిల్లా రాజకీయాలనే కుదిపేసింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు 144 సెక్షన్ అమలుకు దారి తీసినా పరస్పర దాడులు మాత్రం తప్పలేదు. సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ఆయన వర్గీయులు, అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పాయం వెంకటేశ్వర్లుతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని ‘రేగా’ అనుచరులతో పాటు పోలీసులూ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా, పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. తనను అడ్డుకున్న పోలీసులతో పాయం వెంకటేశ్వర్లు విభేదించారు. దీంతో 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో ఏఎస్ఐ మోహన్ విధులకు ఆటంకం కలిగించినందుకు పిడమర్తి రవితో పాటు మరో ఐదుగురిపై 188, 143, 353,ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు చందాలు వసూలు చేసి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అనుమతి లేకున్నా వచ్చి తమపై దాడి చేశారంటూ ఆ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నా అశోక్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య, గజ్జల లక్ష్మారెడ్డితో పాటు మరో ఎనమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై 188,143,324,109 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్.. మల్లెలమడుగులో జరిగిన ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో రేగా కాంతారావు.. పొంగులేటి, పిడమర్తి రవిని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు హాట్‌టాపిక్‌గా మారాయి. పిడమర్తి రవిని దళిత ద్రోహిగా అభివర్ణించిన ‘రేగా’ పినపాక నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. కాగా గత ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ పొంగులేటికి సన్నిహితుడు కావడం, వచ్చే ఎన్నికల్లోనూ పాయం ఇదే పార్టీ నుంచి పోటీకి సన్నద్ధమవుతుండడంతో ఇరువర్గాల మధ్య అంతర్గత పోరు మొదలైంది. ఆది నుంచి పాయం వెంకటేశ్వర్లుకు అండగా ఉంటున్న పొంగులేటిపై ‘రేగా’ విమర్శలకు కారణమిదే అనే ప్రచారం గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, నియోజకవర్గ స్థాయి యువతతో ఆదివారం రేగా కాంతారావు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏ అంశాలు చర్చిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా.. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు, మార్పులు ఎలా ఉంటాయోననే చర్చ మొదలైంది. నేనో సీనియర్ ఉద్యమకారుడిని. తెలంగాణ ఉద్యమంలో నేను పోషించిన పాత్ర మీ అందరికీ తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా సేవలందించా. పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురంలో మాదిగ జేఏసీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆవిష్కరణకు నన్ను పిలిచింది. అదే కులానికి చెందిన బిడ్డగా ఈనెల 25న నేను ఆ విగ్రహావిష్కరణకు వెళ్తే పది మంది నాపై దాడి చేశారు. నాతో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అడ్డుకున్న పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రోద్బ లంతోనే ఇదంతా జరిగింది. మాకు జరిగిన అవమానంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా. – పిడమర్తి రవి -
కుటుంబ కలహాలు: బావ తలపగులగొడుతావా..? అంటూ అన్నపై..
సాక్షి,పరిగి(వికారాబాద్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మయ్య(38) అదే గ్రామానికి చెందిన తన చెల్లెలు భర్త వెంకటయ్యతో మంగళవారం రాత్రి గొడవపడ్డాడు. ఈక్రమంలో లక్ష్మయ్య తన బావ వెంకటయ్య తలపగులగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటయ్య కుమారుడు నవీన్ లక్ష్మయ్యపై దాడి చేశాడు. బుధవారం ఉదయం లక్ష్మయ్య తమ్ముడు అనంతయ్య.. బావ తలపగులగొడుతావా..? అంటూ ఆగ్రహంతో లక్ష్మయ్యపై రాళ్లు, కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఇంట్లోకి వెళ్లి పడుకున్న లక్ష్మయ్య దెబ్బలకు తాళలేక మృతి చెందాడు. మధ్యాహ్నం అయినా ఆయన ఇంట్లోంచి రాకపోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లక్ష్మయ్యపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతయ్య పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. లక్ష్మయ్య ఆయన భార్య గతంలోనే విడిపోయింది. ఆయనకు 7 సంవత్సరాల కూతురు ఉంది. తండ్రి మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారింది. చదవండి: ‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. -
వైభవంగా పెళ్లి వేడుకలు; ఇంతలో ఊహించని పరిణామం
మీరట్: ఆ ఇంట్లో అంరగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇంకా కొద్దిసేపట్లో వివాహతంతు ముగుస్తుందనగా ఒక వ్యక్తి తుపాకీతో మంటపంలోకి ప్రవేశించాడు. వచ్చీ రాగానే తుపాకీతో కాల్పులు జరిపాడు. తుపాకీ తూటాలకు ఒక వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలగా.. మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పటివరకు ఆహ్లదకరంగా ఎంతో సంతోషంగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని సరూర్‌పూర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని 18 ఏళ్ల సుమిత్‌గా.. గాయపడిన వ్యక్తిని అంకుర్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత అగంతకుడు సురేంద్ర అలియాస్ కల్లు.. సుమిత్‌పై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సుమిత్తో ఉన్న పాత గొడవల కారణంగానే సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే సుమిత్ శరీరంలోకి దూసుకెళ్లిన బులెట్ పక్కనే ఉన్న అంకుర్‌ను గాయపరిచిందన్నారు. అయితే నిందితుడు సురేంద్ర కాల్పులు జరిపి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం సుమిత్‌ను తరలిస్తుండగా.. కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకోలేదు. సుమిత్ మృతికి కారణమైన సురేంద్రను మాకు అప్పగించాలని కోరినా పోలీసులు అందుకు నిరాకరించారు. మూడు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా.. చివరికి పోలీసులు ఎలాగోలా సుమిత్ కుటుంబసభ్యులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్ల వీరంగం
తాడిపత్రి: పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీలోని ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మత్తులో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ధ్వంసం చేశారు. అసలేం జరిగిందంటే... తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్‌చైర్‌పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్‌కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లి మద్యం తాగారు. వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్‌కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. గాయపడిన వారు డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో వైస్ చైర్ పర్సన్ సరస్వతి వర్గానికి చెందిన జనార్ధన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పగ పెంచుకోవడం సరి కాదు!
ఎండ చల్లగా... వెన్నెల వేడిగా.. తీపి కారంగా.. పులుపు చేదుగా... ఇలా లవర్ చెంత ఉన్నప్పుడు ఏదీ దానిలా అనిపించదు.. కనిపించదు. ప్రేమ మహత్యం అది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’ అని లవ్‌లో ఉన్నప్పుడు బోల్డన్ని ఊసులు చెప్పుకుంటారు. ఒకవేళ బ్రేకప్ అయ్యారా? ఒకరి గురించి మరొకరు వీలైనన్ని విమర్శలు చేసేస్తారు. కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. బ్రేకప్ అయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఒకర్నొకరు నిందించుకోరు. ఇలియానా ఈ టైపే. ఈ గోవా బ్యూటీ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఇల్లీ బేబీకి ఇది ఫస్ట్ లవ్ కాదు. అంతకుముందే లవ్‌లో పడ్డారు. ఆ విషయం గురించి ఇలియానా చెబుతూ - ‘‘ఇన్నిసార్లు ప్రేమలో పడ్డానని లెక్కేసి చెప్పలేను కానీ, గతంలో నేనూ ప్రేమలో పడ్డాను. ఏవో మనస్పర్ధల కారణంగా విడిపోయాం. కానీ, ‘ఇక నుంచి నీ జీవితం బాగుండాలని’ తనూ, అతని జీవితం బాగుండాలని నేనూ చెప్పుకుని మరీ విడిపోయాం. అంతే కానీ, పగ పెంచుకోలేదు. ఏదో రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. అఫ్కోర్స్ మాజీ లవర్స్‌తో నేను స్నేహంగా ఉండటంలేదు. అయితే శత్రుత్వం మాత్రం పెంచుకోలేదు’’ అన్నారు.