తాడిపత్రి: పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీలోని ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మత్తులో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ధ్వంసం చేశారు.
అసలేం జరిగిందంటే...
తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్‌చైర్‌పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్‌కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లి మద్యం తాగారు.
వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్‌లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్‌కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. గాయపడిన వారు డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో వైస్ చైర్ పర్సన్ సరస్వతి వర్గానికి చెందిన జనార్ధన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment