సాక్షి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. మునిసిపల్ అధికారులు.. పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయటం వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మునిసిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
కాగా, తిరుపతి నగరంలో నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ఒక టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి భవనాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భవన యజమానిపై దాడికి దిగారు. ఈ వ్యవహారం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.
తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న విరజా మార్గంలోని టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అతడి ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంతో ఆయన అధికారబలంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి ఇంటి (నాలుగు అంతస్తుల భవనం) పైకి ఆ రోడ్డుని మళ్లించారు. నూతనంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనంపై తన మనుషులతో మంగళవారం 15 అడుగుల పబ్లిక్ రోడ్డు అని రాయించారు.
ఈ విషయమై భవన యజమాని మాస్టర్ ప్లాన్ మ్యాప్‌ని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగి నోరెత్తడంలేదు. బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య తన మనుషులతో భవనం వద్ద పనులు చేసుకుంటున్న యజమానిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలు బయటకు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment