
మృతుడు అమిత్, పక్కన ఏఐ జెనరేటెడ్ ప్రతీకాత్మక చిత్రం
ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.
రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది.

మీరట్ అక్బర్‌పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.

రవితకు అమర్‌జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్‌జీత్‌తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్ వేసింది. అమర్‌జీత్ సాయంతో అమిత్ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
రవితతో పాటు అమర్‌జీత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.