
ఉత్తరప్రదేశ్: ఫతేపూర్ జిల్లాలో నలభై రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడో యువకుడు. ఇంకా రెండు సార్లు సైతం పాము తనను కాటు వేస్తుందని తెలిపాడు. 9వసారి కాటు వేసిన తర్వాత ఎవరూ కాపాడలేరని చెప్పడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే అనే యువకుణ్ని 40 రోజుల వ్యవధిలోనే వేర్వేరు పాములు ఏడుసార్లు కాటు వేశాయి.
ప్రస్తుతం వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 12 నుంచి 14 గంటల్లో వికాస్ స్పృహలోకి రాకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్యుడు జవహర్ లాల్ తెలిపారు. ఆరోసారి పాము కాటుకు గురైన సమయంలో వికాస్ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టాడు. అతడికి ఓ కల వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కలలో తనను ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వివరించాడు.
ఎలాంటి చికిత్స అందించినా సరే 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని తెలిపాడు. తనను ప్రతి సారి ఆడ పాము కాటు వేస్తోందని అది కూడా శని లేదా ఆదివారాల్లో మాత్రమే ఇలా జరుగుతోందని చెప్పాడు. వరుస పాము కాటుల నేపథ్యంలో వికాస్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వికాస్ దూబే చికిత్స అందించిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.