మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం వడగళ్ల వాన కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి...
- 600 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు దెబ్బ
- పర్యటించిన ప్రజాప్రతినిధులు
నంగునూరు: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం వడగళ్ల వాన కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. సిద్దన్నపేట, బద్దిపడగ, నంగునూరు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో మామిడి కాయలు రాలాయి.
చాలాచోట్ల తోటల్లో మామిడి చెట్లు నేలకొరిగాయి. వరి చేనులో వడ్లు రాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. బద్దిపడగలో రోడ్డు చెట్టు కూలడంతో పక్కన నిలిపిన టీవీఎస్ ఎక్సల్ వాహనం దెబ్బతింది. రాకపోకలకు అంతరాయం కల్గింది. మూడు గ్రామాల్లో సుమారుగా 400 ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది.
ఆర్డీఓ, ఎంపీపీ సందర్శన..
మూడు గ్రామాల్లో జరిగిన పంట నష్టం విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు బద్దిపడగ, సిద్దన్నపేట గ్రామాలను సందర్శించారు. మామిడి తోటలు, పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గురువారం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటల నష్టం వివరాలను సేకరిస్తారని చెప్పారు. వారి వెంట సర్పంచ్ బెదురు గిరిజ, మద్దికుంట మంజూల, నాయకులు దువ్వల మల్లయ్య, వెంకట్‌రెడ్డి, పురేందర్, వెంకట్రాంజం, జయపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.