మామిడి పండు.. దళారీ దండు | mango farmers are not getting actual amount | Sakshi
Sakshi News home page

మామిడి పండు.. దళారీ దండు

Published Sun, Apr 23 2017 1:26 AM | Last Updated on Tue, Oct 9 2018 4:56 PM

మామిడి పండు.. దళారీ దండు - Sakshi

మామిడి పండు.. దళారీ దండు

  • మార్కెట్‌ మాయాజాలంతో మామిడి రైతు కుదేలు
  • పండ్ల ధరలు ఒక్కసారిగా పతనం.. పక్షం రోజుల్లో తారుమారైన పరిస్థితి
  • బంగినపల్లి రకం ధర క్వింటాలుకు రూ. వెయ్యే.. తోతాపురి రూ. 6 వందలే..
  • మార్చిలో రూ. 25 వేల నుంచి 32 వేలు పలికిన క్వింటాలు ధర
  • 11 శాతం కమీషన్‌ వసూలు చేస్తూ రైతుల్ని టోకుగా ముంచేస్తున్న దళారులు
  • రైతు నుంచి తక్కువ ధరకు కొని నాలుగు రెట్లకు అమ్ముతున్న వ్యాపారులు
  • పంటను వెనక్కి తీసుకెళ్లలేక తెగనమ్ముకుంటున్న రైతులు
  • చిలుకూరి అయ్యప్ప, సాక్షి ప్రతినిధి:
    ఫలాల్లో రారాజు మామిడి..!
    మరి ఆ ‘రారాజు’ను పండించే రైతన్న..?

    దిగుబడి వచ్చినా ధర లేక, మార్కెట్‌ మాయాజాలపు చదరంగంలో ఓడిపోయి ‘పేద’గా మిగిలిపోతున్నాడు! తియ్యని పండ్లను మార్కెట్లకు తెచ్చి ‘చేదు’నష్టాలను మూటగట్టుకొని ఇంటిబాట పడుతున్నాడు. రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, దళారులు మాత్రం బయట మార్కెట్‌లో నాలుగు రెట్లకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. గతేడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ప్రస్తుతం మామిడి దిగుబడి మునుపటి కంటే భారీగా పెరిగింది. దీంతో ఆదాయం రెట్టింపు అవుతుందని భావించిన మామిడి రైతులకు దళారీ మార్కెట్‌ షాకిచ్చింది. సీజన్‌ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు.. దిగుబడులు పెరుగుతున్న కీలక తరుణంలో ఒక్కసారిగా తగ్గించేశారు.

    రాష్ట్రంలో ప్రధాన మార్కెట్‌ అయిన హైదరాబాద్‌లోని కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌లో మార్చి నెల రెండో వారంలో బంగినపల్లి రకం మామిడి క్వింటాలుకు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.1,500 మించి చెల్లించడం లేదు. గతనెలలో తోతాపురి రకం మామిడి రూ.2 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.600 నుంచి నుంచి రూ.900 మధ్య చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మామిడి పంట 4.71 లక్షల ఎకరాల్లో ఉన్నట్లు ఉద్యానవన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సగటున 21.19 లక్షల టన్నుల దిగుబడులు రావాల్సి ఉన్నా.. వడగళ్ల దెబ్బతో 14.13 లక్షల టన్నుల మామిడి దిగుబడులు వస్తాయని అధికారుల అంచనా. గతేడాది ఈ దిగుబడులు 10 లక్షల టన్నుల లోపే ఉన్నాయి.

    మార్కెట్‌ మాయాజాలమిదీ..
    రాష్ట్రంలో మెజారిటీ రైతులు కొత్తపేటలోని గడ్డి అన్నారం పళ్ల మార్కెట్‌లోనే దిగుబడులు విక్రయిస్తారు. వరంగల్, జగిత్యాలలోని చిన్న మార్కెట్లలో కొనుగోలు చేసిన దిగుబడులు సైతం కొత్తపేట్‌ మార్కెట్‌కు లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. సమయం గడిస్తే పండ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పంటను ప్రత్యామ్నాయంగా విక్రయించే అవకాశాలు లేకపోవడంతో కొత్తపేట మార్కెట్‌కు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ మార్కెట్‌కు డిమాండ్‌ విపరీతంగా ఉండడంతో దళారులు.. కొనుగోలు, అమ్మకాలను శాసిస్తున్నారు. దళారులు నిర్ణయించిన ధరకు విక్రయించడం ఒకటైతే... 11 శాతం కమీషన్‌ రూపంలో వసూలు చేయడంతో రైతు టోకుగా మోసపోతున్నాడు. మార్కెటింగ్‌ శాఖ నిబంధనల మేరకు 4 శాతానికి మించి కమీషన్‌ వసూలు చేయకూడదు.



    రైతును గుల్ల చేస్తున్న వేలం
    మార్కెట్‌కు వచ్చిన మామిడి దిగుబడులకు దళారులే ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం గడ్డిఅన్నారం మార్కెట్‌లో 97 స్టాళ్లు ఉండగా.. వీటి పరిధిలో 267 మంది కమీషన్‌ ఏజెంట్లున్నారు. వీరి వద్దకు వచ్చిన దిగుబడులకు ధరను వేలం ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు.  ఇందులో పాల్గొనేవారు సైతం కమీషన్‌ ఏజెంట్ల మనుషులే కావడంతో ధరల పెంపు, తగ్గింపు అంతా వారి నిర్ణయం మేరకే జరుగుతోంది. ఇక్కడ దిగుబడి తెచ్చిన రైతు కేవలం ప్రేక్షకుడిగానే ఉండాలి. ఈ ప్రక్రియతో అత్యుత్తమ రకం మామిడి  తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మార్కెట్‌ పూర్తిగా దళారులమయమైంది. గడ్డి అన్నారం మార్కెట్‌లో 60 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నా.. ఒక్క రైతుకూ నిల్వ చేసుకునే అవకాశం దక్కడం లేదు.

    కొనేది రూ.15... అమ్మేది రూ.60
    రైతు నుంచి తక్కువ ధరలో మామిడి దిగుబడులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు... బహిరంగ మార్కెట్లో నాలుగింతలు పెంచేసి విక్రయిస్తున్నారు. రైతుల నుంచి టోకుగా కోనుగోలు చేస్తున్న బంగినపల్లి మామిడికి కిలోకు రూ.10–15 చెల్లించి.. అవి మక్కిన తర్వాత రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. అలాగే తోతాపురి రకం మామిడిని కిలోకు రూ.6 నుంచి రూ.9కి కొంటున్న వ్యాపారులు.. బహిరంగ మార్కెట్‌లో రూ.25 నుంచి రూ.35 దాకా విక్రయిస్తున్నారు.
     

    ఈయన పేరు సత్తన్న. వనపర్తికి చెందిన ఈ రైతు గతేడాది రూ.2.5 లక్షలు పెట్టి 8 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. దిగుబడి బాగానే వచ్చింది. పళ్లను హైదరాబాద్‌లోని కొత్తపేట మార్కెట్‌కు తెచ్చాడు. ఇప్పటిదాకా మూడు దఫాలుగా 8 టన్నుల మామిడి పళ్లను విక్రయించగా రూ. 1.5 లక్షలు మాత్రమే వచ్చాయి. మరో2 టన్నుల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ అంతా లెక్కేసుకుంటే పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో శనివారం ఉదయం మార్కెట్లో ఇలా తల పట్టుకుని కూర్చున్నాడు.

    ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
    ‘‘మార్కెట్లో కమిషన్‌ 4% మించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తున్నాం. లిఖిత పూర్వక ఫిర్యాదు వస్తే.. ఆ కమిషన్‌ ఏజెంటు లైసెన్సు రద్దు చేసే అధికారం మాకుంది. కానీ ఇప్పటివరకు ఫిర్యాదులేవీ రాలేదు. ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తెలిస్తే నోటీసులు ఇస్తున్నాం. త్వరలో మార్కెట్‌లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తాం..’’        

    పుట్టం పురుషోత్తం రావు,     గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌

    కూలీ కూడా దక్కలేదు
    ‘‘రూ.3.5 లక్షలు పెట్టి ఐదెకరాలు కౌలుకు మామిడి వేసిన. మార్కెట్‌కు ఈ రోజు 16 క్వింటాళ్ల మామిడి తీసుకొచ్చిన. వాటిని కొన్న వ్యాపారులు రూ.5 వేలు చేతిలో పెట్టారు. పొలం నుంచి మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు బండి కిరాయికి రూ.4,500 ఖర్చయింది. కాయ తెంపేందుకు 10 మంది కూలీలకు రూ.3 వేలు చెల్లించిన. ఇప్పుడు మార్కెట్లో రూ.5 వేలు వచ్చినయి. మరి నాకెంత లాభం వచ్చిందో చెప్పండి..’’
        – రంగస్వామి, మామిడి రైతు, పెబ్బేరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement